నిండు జీవితం.. విషాదాంతం

22 Dec, 2016 22:36 IST|Sakshi
నిండు జీవితం.. విషాదాంతం
  •  తాగుడుకు బానిసై తరచూ గొడవలు
  • టీవీ చానల్‌ మార్చే విషయంలో ఘర్షణ
  • కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు                                
  • ముదిగుబ్బ మండలం ఏబీపల్లె తండాకు చెందిన డి.లక్ష్మానాయక్‌(27) కుటుంబ సభ్యుల దాడిలో బుధవారం రాత్రి తీవ్రంగా గాయపడి, చివరకు ప్రాణాలు కోల్పోయాడని ఏఎస్‌ఐ విజయభాస్కర్‌రాజు గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం... తండాకు చెందిన లక్ష్మీబాయి, వెంకటేశ్‌ నాయక్ దంపతులకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు సంతానం. కుమార్తెతో పాటు పెద్ద కుమారుడు గోపాల్‌నాయక్‌కు వివాహాలయ్యాయి. లక్ష్మానాయక్, రామునాయక్‌ కవల పిల్లలు. వారిద్దరూ అవివాహితులు. వారిలో లక్ష్మానాయక్‌ తాగుడుకు బానిసయ్యాడు. ప్రతి రోజూ మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా అతను పీకల దాకా మందు తాగి ఇంటికొచ్చాడు.

    కుటుంబ సభ్యులందరూ టీవీ చూస్తుండగా..

    అమ్మానాన్న, తమ్ముడు అందరూ కలసి బుధవారం రాత్రి ఎంతో ఆసక్తిగా టీవీ చూస్తున్నారు. అంతలోనే మద్యం మత్తులో ఊగుతూ ఇంటికొచ్చాడు లక్ష్మానాయక్‌. అప్పటి వరకు చూస్తున్న చానల్‌ను మార్చాలని పట్టుబట్టాడు. కాసేపు ఆగమని చెప్పినా అతను విన్పించుకోలేదు. కుటుంబ సభ్యులు సహనం కోల్పోయారు. తల్లిదండ్రులు. సోదరులు కలసి లక్ష్మానాయక్‌ను చితకబాదారు. అంతటితో ఆగక కాళ్లు, చేతులు కట్టేసి ఇంటి బయటపడేశారు. అదే రోజు అర్ధరాత్రి రామునాయక్‌ మరోసారి లక్ష్మానాయక్‌పై దాడి చేసి బలంగా కొట్టడంతో అతను గిలగిలాకొట్టుకుంటూ మరణించాడు. 

    రంగంలోకి పోలీసులు..

    ఘటనపై లక్ష్మానాయక్‌ తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పరిశీలించారు. కదిరి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు