'అనంత'లో ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురి మృతి

24 Aug, 2015 07:03 IST|Sakshi
'అనంత'లో ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురి మృతి

అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.   పెనుకొండ మండలం  మడకశిర రైల్వే గేటు వద్ద నాందేడ్ ఎక్స్ప్రెస్ ఓ గ్రానైట్ లారీని ఢీకొట్టింది. దీంతో రైలులోని మూడు బోగీలుపట్టాలు తప్పాయి. బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీ ఆకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో పట్టాలు మీదుకు దూసుకెళ్లి నాందేడ్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. దాంతో గ్రానైట్ రాయి ఏసీ బోగీపై పడి ఆ బోగీ నుజ్జనుజ్జు అయింది. లారీ క్లీనర్ సహా ఐదుగురు మృతిచెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 30మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి.

గ్రానైట్ లారీ రైలు ఎస్1 బోగీని ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న కర్ణాటకకు చెందిన దేవ్ దుర్గ్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ మృతిచెందినట్టు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రిస్కూం సిబ్బంది, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

వారిని చికిత్స నిమిత్తం పెనుకొండ, బెంగళూరు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. రైలు ప్రమాదంలో మృతిచెందిన సయ్యద్ అహ్మద్, రైల్వే ఏసీ టెక్నిషియన్, పుల్లారావు రైతు(రాయచూర్), వీఎస్టీ రాజు(బెంగళూరు ఇండోఫిల్ కంపెనీ జీఎమ్), లారీ క్లీనర్ గా పోలీసులు గుర్తించారు. అయితే నాందేడ్ ఎక్స్ప్రెస్ను ఢీకొన్న గ్రానైట్ లారీ నంబరు AP 16 TT 9885, 2003 లో వెంకట సుబ్బయ్య పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్టు అధికారులు వెల్లడించారు.

కాగా, ఈ ఘటనతో అనంతపురంలో రాజధాని ఎక్స్ప్రెస్, గార్లె దిన్నెలో బీదర్ ఎక్స్ప్రెస్, కల్లూరు సోలాపూర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి. బెంగళూరు గుంతకల్లు రైలును వయా కాడ్పాడి, బోలార్ పేట, పాకాల, ధర్మవరం జంక్షన్ మీదుగా మళ్లించారు. నిజాముద్దీన్ - బెంగళురు సిటీ రాజధాని ఎక్స్ప్రెస్ను పాకాల మీదుగా మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. మడకశిర వద్ద రైల్వే ట్రాక్ క్లియర్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రైల్వే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పెనుకొండ రైలు ప్రమాద ఘటనలో హెల్ప్లైన్ నంబర్లు పెనుకొండ:  08555 220249,ధర్మవరం: 08559 222555, అనంత: 08554 236444   ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన  మంత్రి పరిటాల సునీత ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. రైలు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే బీకే పార్థసారధి మాట్లాడుతూ.. గాయపడ్డ రైలు ప్రయాణికులను బెంగళూరు ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. అనంతపురం రైలు ప్రమాదంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపాన్ని తెలియజేశారు.





 

మరిన్ని వార్తలు