'అది నా అదృష్టం.. అమితానందం'

29 Oct, 2015 21:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారిణిగా సొంత రాష్ట్రానికే సేవలందించే అదృష్టం రావడం అమితానందంగా ఉందని కె.అపూర్వ రావు అన్నారు. ఈనెల 31న పాసింగ్ పరేడ్ అనంతరం రాష్ట్రానికి సేవలందించేందుకు సిద్ధమవుతున్న యువ మహిళా ఐపీఎస్ ‘సాక్షి’తో మాట్లాడారు. ‘దేశానికి సేవలందించేందుకు అత్యంత అద్బుతమైన మార్గం పోలీస్. అందుకే ఎంతో మక్కువతో ఐపీఎస్ అయ్యా. సివిల్ సర్వీస్ 2013 బ్యాచ్‌లో దేశానికి చెందిన 141 మంది శిక్షణ పొందాం. నాతో పాటు రాహుల్ హెగ్డె బి.కె, సునీల్ దత్‌ను తెలంగాణకి కేటాయించారు. ఇలా సొంత రాష్ట్రాలకు కేటాయింపులు చేయడం చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి సేవలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. పుట్టినగడ్డకు రుణం తీర్చుకునే అవకాశం ఈ రకంగా వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. ప్రజలకు మేలు చేస్తా’నని తెలిపారు.
ప్రజల కష్టాలు తెలుసు...
స్వస్థలం హైదరాబాద్‌లోని బేగంబజార్. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న కె.నాగేశ్వరరావు సివిల్ కాంట్రాక్టర్. అమ్మ అరుణ గృహిణి. సోదరిణి కూడా ఉంది. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలమే. అయితే నేను చిన్నదాన్ని కావడంతో ఎక్కువ గారాబం చేశారు. ఆడపిల్లలమని ఎక్కడా మాకు నిబంధనలు పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. చదివింది బీటెక్ అయినా...పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తానంటే అమ్మనాన్నలు ఎక్కడ అడ్డు చెప్పలేదు. కుటుంబ ఆర్థిక అవసరాల దృష్ట్యా బీటెక్ అయ్యాక ఓ సంవత్సరం పాటు టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఐపీఎస్‌కు ట్రై చేశా. తొలి ప్రయత్నంలోనే 596వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికవడం. అది కూడా సొంతగడ్డకు సేవ చేసే భాగ్యం రావడం జీవితంలోనే అత్యంత మధురక్షణాలు.

రోజులు మారాయి...
పోలీసుశాఖలో మహిళలు ఎక్కువ చేరడానికి అంతగా ఆసక్తి చూపరనేది గతం. ప్రస్తుతం రోజులు మారాయి. మహిళలు కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఈ విషయం ఇప్పటికే నిరూపితమైంది కూడా. పోలీసుశాఖలో మహిళల శాతం చాలా తక్కువగా ఉండటం వాస్తవమే... అయినా ఇది బాధాకరం. పోలీసుశాఖలో 33 శాతం రిజర్వేషన్ కచ్చితంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరం.

ప్రస్తుతం మా బ్యాచ్‌లో 141 మంది 26 మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య గతంతో పోల్చితే ఎక్కువే. ఇది మునుముందు మరింత పెరగాలని ఆశిస్తున్నా. ఇక నా విషయానికొస్తే ఐపీఎస్ అవుతానంటే కుటుంబసభ్యులెవరూ అభ్యంతరం చెప్పలేదు. పైగా అమ్మానాన్నలు మరింత ప్రోత్సాహం ఇచ్చారు. వారి సహకారం వల్లే తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించగలిగా.
ట్రైనింగ్‌లో ఎంతో నేర్చుకున్నా..
ఐపీఎస్‌కు ఎంపికైన తర్వాత ట్రైనింగ్‌కు సంబంధించి మొదట్లో కాస్త కంగారుపడ్డాను. కానీ నేను ఎంతో అభిమానించిన వృత్తి కావడంతో శిక్షణలో ప్రతి రోజూ నూతనొత్సాహంతో నేర్చుకున్నా. ఈ పోలీస్ అకాడమిలో శిక్షణ ఓ అద్బుత అనుభవాన్నిచ్చింది. నేను వృత్తిలో పలు సవాళ్లను ఎదుర్కోగల ధైర్యాన్నివ్వడంతో పాటు పోలీసింగ్‌పై ఎన్నో అంశాలపై అవగాహన కలిగింది. తిరుపతి ఉప ఎన్నిక బందోబస్తుకు వెళ్లినప్పుడు శాంతిభద్రతలను డీల్ చేసే విధానం, నాసిక్ కుంభమేళాలో రద్దీని అదుపు చేసే విధానం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చాయి. ఇప్పటి దాకా కేవలం వ్యక్తుల్ని లక్ష్యం చేసుకున్న నేరాలను మాత్రమే చూశాం.

కానీ ప్రస్తుతం సైబర్ నేరాలు సమాజంపై పెను ప్రభావాల్ని చూపుతున్నాయి. వెబ్‌సైట్లు ఎలా హాక్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ అకృత్యాలను నివారించేందుకు ఓ కామన్ సాప్ట్‌వేర్ ఉండాలన్నది నా నిశ్చితాభిప్రాయం. అప్పుడే ఇలాంటి దుశ్చర్యలకు దేశ వ్యాప్తంగా అడ్డుకట్ట వేయగలం. ఇక నిఫుణులు ఆర్‌బీఐ గవర్నర్ రంగరాజన్ వంటి వారు ఇచ్చిన ప్రత్యేక తరగతులు మాలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపాయి. ఎన్నో సామాజిక అంశాలను తెలుసుకోగలిగాము. వారిచ్చిన స్ఫూర్తితో పోలీసు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తా.

మరిన్ని వార్తలు