పోస్టింగ్ ఇవ్వలేదని.. ట్రైనీ ఎస్సై ఆత్మహత్య

23 Sep, 2016 04:15 IST|Sakshi
పోస్టింగ్ ఇవ్వలేదని.. ట్రైనీ ఎస్సై ఆత్మహత్య

2015 బ్యాచ్‌కు ఎంపికైన కిరణ్
18 నెలల పాటు శిక్షణ మధ్యలో గాయం కారణంగా 25 రోజులు విరామం
దాంతో తుది పరీక్షలు నిర్వహించని అధికారులు
ఆయనతో పాటు శిక్షణ తీసుకున్న మిగతా వారికి పోస్టింగ్
ఆవేదనతో తన ఇంట్లో ఉరి వేసుకున్న కిరణ్
డెరైక్టర్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

 
మిర్యాలగూడ: శిక్షణ పూర్తయినా తనకు పోస్టింగ్ ఇవ్వలేదని ఓ ట్రైనీ ఎస్సై మనస్తాపం చెందారు. శిక్షణ సమయంలో గాయమై విశ్రాంతి తీసుకున్న కారణంగా తనను పక్కన పెట్టవద్దంటూ అధికారుల చుట్టూ తిరిగారు. ఫలితం లేకపోవడంతో తీవ్రంగా ఆవేదనకు లోనై బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం ఈ ఘటన జరిగింది. మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీకి చెందిన తమ్మడబోయిన మణెమ్మ కుమారుడు కిరణ్ (28). ఆయన 2015లో ఎస్సై ఉద్యోగ అర్హత పరీక్షలో విజయం సాధించి, శిక్షణకు ఎంపికయ్యారు.

దాదాపు 18 నెలలుగా హైదరాబాద్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. అయితే శిక్షణ సమయంలో బాత్‌రూంలో సింక్ పగిలి గుచ్చుకోవడంతో కాలికి గాయమైంది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా.. గాయం తగ్గకపోవడంతో స్వగ్రామం మిర్యాలగూడకు వెళ్లి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. గాయం మానిపోయాక వైద్యుల నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకొచ్చి.. పోలీస్ అకాడమీ డెరైక్టర్‌కు అందించి తిరిగి శిక్షణలో చేరారు.
 
శిక్షణ పూర్తికాకపోవడంతో..
అయితే కిరణ్‌తోపాటు శిక్షణ పొందుతున్న అందరికీ తుది పరీక్షలు నిర్వహించి, పోస్టింగ్ ఇచ్చారు. కిరణ్‌కు మాత్రం శిక్షణలో 25 రోజుల విరామం రావడంతో తుది పరీక్షలు నిర్వహించలేదు. తుది పరీక్ష నిర్వహించి, పోస్టింగ్ ఇవ్వాలంటూ కిరణ్ కొంత కాలంగా ఉన్నతాధికారుల చుట్టూ తిరిగారు. కానీ మరో బ్యాచ్‌తో కలిపి పరీక్ష పెడతామని వారు స్పష్టం చేయడంతో తీవ్రంగా మనస్తాపానికి గురయ్యూరు. తిరిగి స్వగ్రామానికి వెళ్లినా ఆవేదనలో మునిగిపోయారు. బుధవారం రాత్రి తన గదిలోని ఫ్యాన్‌కు విద్యుత్ వైర్లతో ఉరి వేసుకున్నారు.

గురువారం ఉదయం కుటుంబ సభ్యులు తలుపుకొట్టినా స్పందన రాకపోవడంతో.. కిటికీ నుంచి చూసి, ఉరివేసుకున్నట్లుగా గుర్తించారు. కిరణ్‌కు ఏడాదిన్నర క్రితమే సూర్యాపేటకు చెందిన కల్యాణితో వివాహం జరిగింది. వీరికి ఐదు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే పోలీస్ అకాడమీ  డెరైక్టర్ ఈష్‌కుమార్ వేధింపుల కారణంగానే కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చిన కిరణ్..  డెరైక్టర్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తరచూ ఆందోళన చెందేవాడని చెబుతున్నారు. పోలీసు అకాడమీ డెరైక్టర్ వేధింపుల కారణంగా కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆయన సోదరుడు అర్జున్ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు