ఇక జిల్లాలో మైనారిటీలకు శిక్షణ కేంద్రం

19 Oct, 2016 23:15 IST|Sakshi
ఇక జిల్లాలో మైనారిటీలకు శిక్షణ కేంద్రం
• జిల్లా కేంద్రంలోని మాలపల్లిలో భవనం ఎంపిక
•  సందర్శించిన కలెక్టర్‌ యోగితారాణా
• పక్షం రోజుల్లో ప్రారంభించాలని అధికారులకు ఆదేశం
ఇందూరు :
జిల్లాలో మైనారిటీ నిరుద్యోగ యువతీయువకులకు వివిధ రంగాల్లో ఉచితంగా శిక్షణ అందించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కలెక్టర్‌ యోగితా రాణా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంతవరకు జిల్లాలో మైనారిటీల కోసం శిక్షణ కేంద్రాలు లేవు. ప్రస్తుతం కలెక్టర్‌ నిర్ణయంతో నిరుద్యోగ మైనారిటీ యువతకు భరోసా కల్పించినట్లైంది. ఇందుకు జిల్లా కేంద్రంలోని మాలపల్లిలో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం మాలపల్లిలోని ఖాళీగా ఉన్న ఉర్దూ బాలికల జూనియర్‌ కళాశాల భవనాన్ని కలెక్టర్‌ సందర్శించారు. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భవనం అనుకూలంగా ఉండడంతో భవనాన్ని అన్ని హంగులతో సిద్ధం చేయాలని, అన్ని విధాల మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవనంపై ఖాళీగా ఉన్న స్థలంలో రేకులతో షెడ్డును నిర్మించాలని సూచించారు. ఇందుకు పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖాధికారులు ఎస్టిమేషన్‌ కాస్ట్‌ నివేదికను అందించాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పక్షం రోజుల్లో శిక్షణ తరగతులను ప్రారంభించాలన్నారు. ఆమె వెంట జిల్లా మైనారిటీ వెల్ఫేర్‌ అధికారి కిషన్, సూపరింటెండెంట్, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులున్నారు.
జిల్లాలో మొదటి శిక్షణ కేంద్రం...
జిల్లాలో మైనారిటీ నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేందుకు ఇంత వరకు శిక్షణ కేంద్రాలను నెలకొల్పలేదు. అయితే జిల్లా మైనారిటీ వెల్ఫేర్‌ అధికారులు కలెక్టర్‌ ఆదేశాలతో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ శిక్షణ కేంద్రంలో ప్రధానంగా మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపయోపడే కోర్సులు అందించనున్నారు. టైలరింగ్, ఫార్మాసిస్ట్‌ అసిస్టెంట్, పేషెంట్‌ కేర్, కస్టమర్‌ రిలేషన్, సేల్, ఐటీ కోర్సులకు సంబంధించి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. నిరుద్యోగుల నుంచి ముందుగా దరఖాస్తులు స్వీకరించి ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఒక్కో కోర్సు శిక్షణ కాలం రెండు నెలలు ఉండనుంది. శిక్షణ పొందే అభ్యర్థులకు రూ.350 చొప్పున సై్టఫండ్‌ను అందజేయనున్నారు.
ఆక్రమణలు తొలగించాలని స్థానికులకు సూచన...
మాలపల్లిలో ఉన్న ఉర్దూ బాలికల జూనియర్‌ కళాశాల గతంలో కొన్నాళ్లు నడిచి ప్రస్తుతం మూతపడింది. అయితే ఈ భవనం చుట్టు ప్రాంతాల్లో పలవురు గుడిసెలు, నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని రెండు, మూడు రోజుల్లో తొలగించుకోవాలని అధికారులు నివాసితులకు స్పష్టం చేశారు. లేకపోతే మున్సిపల్‌ అధికారులే స్వయంగా వచ్చి తొలగిస్తారని హెచ్చరించారు. 
>
మరిన్ని వార్తలు