విద్యార్థులకు రా‘బడి’

28 Sep, 2016 21:46 IST|Sakshi
బస్సు సౌకర్యం లేక నడిచి వెళ్తున్న విద్యార్థులు

బడి లేని ఆవాస విద్యార్థులకు రవాణా భత్యం
ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున చెల్లింపు
జిల్లా వ్యాప్తంగా 855 మందికి ప్రయోజనం

పాపన్నపేట: బస్సు సౌకర్యం లేని విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 855 మంది విద్యార్థులకు ఏటా రూ.3 వేలు చెల్లించేందుకు సర్వశిక్ష అభియాన్‌ సిద్ధమవుతోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్లుగా ‘భత్యం’ కరువు
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి కిలో మీటరుకు ప్రభుత్వ ప్రాథమిక, 3 కి.మీ. లోపు ప్రాథమికోన్నత, 5 కి.మీ.లోపు ఉన్నత పాఠశాల ఉండాలి. లేనిపక్షంలో కనీసం బస్సు సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కనీసం ఆర్టీసీ సర్వీస్‌ లేనిపక్షంలో ఆటోల్లో పాఠశాలకు వెళ్లే 8వ తరగతి లోపు విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లించాలి. ఈ మేరకు మూడేళ్ల క్రితం వరకు ఆటోల్లో ప్రయాణించే విద్యార్థులకు ప్రభుత్వం రవాణా భత్యం చెల్లించింది. కానీ, రెండేళ్లుగా అది కూడా నిలిచిపోయింది. తిరిగి ఈ సంవత్సరం భత్యం చెల్లించేందుకు సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

నెలకు రూ.300 చొప్పున..
జిల్లాలో 855 మంది విద్యార్థులను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. వీరికి నెలకు రూ.300 చొప్పున 10 నెలలకు రూ.3 వేల చొప్పున భత్యం చెల్లించనున్నారు. ఇప్పటికీ చదువుపై ఆసక్తి ఉండి ఆర్థికస్థితి సరిగా లేక చాలామంది విద్యార్థులు కాలినడకన పాఠశాలలకు వెళ్తున్నారు. ఆటోలో వెళ్లే స్తోమత కూడా వారికి లేదు. ఈనేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం నిరుపేద విద్యార్థులకు చల్లని కబురు తీసుకొచ్చింది.

మరిన్ని వార్తలు