ట్రావెల్స్‌ బస్సు బోల్తా

29 May, 2017 21:40 IST|Sakshi
ట్రావెల్స్‌ బస్సు బోల్తా
- 19 మందికి గాయాలు
- నలుగురి పరిస్థితి విషమం 
- డ్రైవర్‌ కునుకుపాటే కారణం
   
జూపాడుబంగ్లా: కర్నూలు - గుంటూరు రహదారిపై తరిగోపుల అంచె సమీపంలో సోమవారం తెల్లవారు జామున ఓ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది.  కొండారెడ్డి ట్రావెల్స్‌కు చెందిన ఏసీ ఓల్వాబస్సు ఆదివారం రాత్రి 10.30 గంటలకు 24 మంది ప్రయాణికులతో కర్నూలుకు బయలుదేరింది. అర్ధరాత్రి 1.30 గంటలకు దోర్నాల చెక్‌పోస్టు దాటిన బస్సు సోమవారం తెల్లవారుజామున 80 బన్నూరు సమీపంలోని తరిగోపుల అంచె మలుపు వద్ద డ్రైవర్‌ మద్దిలేటి రెప్పపాటు కునుకు తీయటంతో బస్సు అదుపుతప్పింది. రహదారి పక్కనే ఉన్న రాయిని ఢీకొని  పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. బస్సు బోల్తా పడటంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తేరుకొని చూసేలోగా అందరూ చెల్లా చెదురుగా పడి ఉన్నారు. ప్రయాణికుల హహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
 
అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు బస్సులోని ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న జూపాడుబంగ్లా ఏఎస్‌ఐ సి.శంకర్, కానిస్టేబుళ్లు ఎం.కె.వలి, శోభన్‌లు సమీపంలోని జేసీబీలను రప్పించటంతోపాటు బస్సులో ఇరుక్కపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణాలు, గాయపడిన వారి పేర్లు తెలుసుకున్నారు. ఆయనతో పాటు మిడ్తూరు ఎస్‌ఐ సుబ్రమణ్యం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. బస్సు డ్రైవర్‌ మద్దిలేటి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. బా««ధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  
 
క్షతగాత్రుల వివరాలు 
  •  విజయవాడ నుంచి భార్య సుహాసినితో వస్తున్న కర్నూలు మాటీవి రిపోర్టర్‌ మల్లికార్జున కుడిచెయ్యి తెగిపోయింది. రక్తమడుగులో ఉన్న భర్తను చూసి అతని భార్య గుండెపోటుకు గురైంది. 
  •  కర్నూలు సస్యషోరూం మేనేజర్‌ క్రిష్ణ వెన్నుకు తీవ్రగాయాలు కావటంతో అతని పరిస్థితి విషమంగా ఉంది.
  •  పెబ్బేరుకు చెందిన చంద్రశేఖర్‌ కాలు తెగిపోయింది. 
  •  నందికొట్కూరుకు చెందిన కాటెపోగురాజుకు తీవ్రగాయాలు అయ్యాయి.
  • మరో 15 మందికి స్వల్పగాయాలు కావటంతో వారిని నందికొట్కూరు, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. 
 
మరిన్ని వార్తలు