గుప్తనిధుల ముఠా అరెస్ట్‌

22 Sep, 2016 22:25 IST|Sakshi
గుప్తనిధుల ముఠా అరెస్ట్‌
– పోలీసులు అదుపులో ఏడుగురు 
– ఆటోతో పాటు గడ్డపారలు స్వాధీనం 
– పరారీలో ప్రధాన సూత్రధారి
  
డోన్‌: పురాతన ఆలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలకు పాల్పడే ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. వెల్దుర్తి మండలంలోని బ్రహ్మగుండం, సమీపంలోని పురాతన ఆలయాలను టార్గెట్‌ చేసిన ముఠాను హోంగార్డ్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. ముఠా వివరాలను డోన్‌ డీఎస్పీ బాబాఫకృద్దీన్, సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌ మీడియాకు వివరించారు. హŸళగుంద మండలం గజ్జనహళ్లి గ్రామానికి చెందిన గొల్లరాముడు గుప్తనిధుల అన్వేషణ పేరుతో ముఠాను తయారు చేశాడు. ఇందులో ఆస్పరి మండలం గార్లపెంట గ్రామానికి చెందిన వడ్డె నరేష్, ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన బోయ తుగ్గలి చెన్నకేశవ్, ఎమ్మిగనూరు మండలం దేవరగట్ట గ్రామానికి చెందినన మాదిగ ఆంజనేయులు, మాదిగ రవికుమార్, గొల్లచంద్ర, వెల్దుర్తి మండలం చెర్లకొత్తూరుకు చెందిన మాదిగ కర్లకుంట తిరుమలేసు, క్రిష్ణగిరి మండలం మాదాపురం గ్రామానికి చెందిన మాదిగ మణీంద్ర ముఠాలో సభ్యులుగా చేరారు.
 
ఇలా పట్టుబడ్డారు: దేవాలయాల్లో ఉండే శాసనాల ద్వారా గుప్తనిధులు ఉన్నట్లు తెలుసుకుని తవ్వకాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వెల్దుర్తి పరిసర ప్రాంతాల్లోని బ్రహ్మగుండం, రామళ్లకోటలోని వనమా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆలయాల ఆవరణలో పచ్చలబండ కింద గుప్తు నిధులు ఉన్నాయని టార్గెట్‌ చేశారు. ఈ మేరకు గొల్లరాముడుతో పాటు మరో ఏడుగురు సభ్యులు బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎమ్మిగనూరు నుంచి ఆటోలో బయల్దేరారు. బ్రహ్మగుండం ఆలయ ఆవరణలో తవ్వకాలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా బీట్‌కు వెళ్లిన హోంగార్డ్‌ జనార్దన్‌ గమనించి పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి గొల్లరాముడు పరారయ్యాడు. ఏడుగురు సభ్యులను స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. వీరి వద్ద నుంచి ఆటో, గడ్డపారలు, పారలు స్వాధీనం చేసుకున్నారు.   
 
హోంగార్డుకు రివార్డు: 
గుప్త నిధుల ముఠా పథకాన్ని భగ్నం చేసి, వారిని సమాచారాన్ని చేరవేసిన వెల్దుర్తి పోలీసుస్టేషన్‌ హోంగార్డ్‌ జనార్దన్‌కు రివార్డు ప్రకటిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు పోలీసుల అ«భినందించి పారితోషికాన్ని అందజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ పురాతన ఆలయాలతో పాటు దేవాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆలయ ధర్మకర్తలు, ఇతర పాలక మండల చైర్మన్‌లు, సభ్యులకు డీఎస్పీ బాబాఫకృద్దీన్‌ ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల గస్తీ నిరంతరం ఉన్నప్పటికీ భక్తులు, ఆలయ భద్రత దృష్ట్యా సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత తప్పనిసరి అన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఐ శ్రీనివాసులును ఆదేశించారు. 
 
మరిన్ని వార్తలు