వైద్యం అందేదెన్నడు?

24 Sep, 2016 00:01 IST|Sakshi
వైద్యం అందేదెన్నడు?

= జిల్లా సర్వజనాస్పత్రిలో భర్తీ కాని పోస్టులు  
= చికిత్స కోసం భారీగా వస్తున్న రోగులు


అనంతపురం సిటీ : జిల్లా సర్వజనాస్పత్రి... పేరులో గొప్పగా ఉన్నా... అక్కడి పనితీరుపై రోగులు పెదవి విరుస్తున్నారు. 2000ల సంవత్సరం వరకు జిల్లా పెద్దాస్పత్రిగా పిలువబడే ఈ ఆస్పత్రి.. మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో సర్వజనాస్పత్రిగా మారిపోయింది. ఆ సమయంలో ఇక్కడ వైద్యుల సంఖ్య పెరుగుతుందని, మెరుగైన చికిత్సలు అందుతాయని జిల్లా వాసులు సంబరపడ్డారు. అప్పటి వరకు వంద పడకలతో ఉన్న ఆస్పత్రికి 350 పడకలొచ్చాయి.

2010లో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రత్యేకంగా 124 జీవో తీసుకువచ్చారు. దీని ప్రకారం 350 పడకలను 500కు పెంచారు. అదే సమయంలో వైద్యులతో పాటు సిబ్బందిని కూడా పెంచాల్సి ఉంది. అయితే తర్వాత వచ్చిన పాలకులు 124 జీవోను అమలు చేయడంలో చిత్తశుద్ధి కనబరచకపోవడంతో వైద్యలతో పాటు సాంకేతిక సిబ్బంది నియామకాలు జరగలేదు. జీవో 124 ప్రకారం సర్వజనాస్పత్రిలో వివిధ విభాగాల్లో 510 మంది నిపుణులు విధుల నిర్వహణలో ఉండాల్సి ఉంది. అయితే 255 మంది మాత్రమే విధులు ఉన్నారు. చికిత్స కోసం భారీగా వస్తున్న రోగులకు వైద్యం చేయలేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.

ప్రాణాలకు విలువ లేదు
విష జ్వరాల ప్రభావంతో జిల్లాలో నిత్యమూ ఎక్కడో ఓ చోట మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. సకాలంలో సరైన చికిత్సలు అందకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నాయన్నది అక్షరసత్యం. అయినా దీనిపై ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. జిల్లాలో వైద్యరంగాన్ని పటిష్టపరిచే దిశగా వారు యోచించడం లేదు. డెంగీలాంటి ప్రమాదకర జ్వరాలు విజృంభిస్తున్నా... పారిశుద్ధ్య పనులపై హడావుడి చేయడం తప్ప... ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సాంకేతిక నిపుణుల పోస్టులను భర్తీ చేయడం లేదు. వారం రోజులకు పైగా సీజినల్‌ వ్యాధ్యుల విషయంపై జిల్లా అట్టుడుకుతోంది. ఆశించిన స్థాయిలో కాకపోయినా ఉన్నంతలో వైద్యం అందించగలిగితే ఫలితాలు మెరుగ్గా ఉండేవి. అయినా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు.

ఇద్దరు ఎస్‌ఆర్‌లు వస్తారన్నారు...
సర్వజనాస్పత్రిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వైద్యులు, సిబ్బంది ఒత్తిళ్లు తాళలేకపోతున్నారు. అందరికీ సర్దిచెప్పి పని చేయిస్తున్నాం. విషయాన్ని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ ద్వారా డీఎంఈ దృష్టికి తీసుకెళితే.. ఇద్దరు సీనియర్‌ రెసిడెన్స్‌ను పంపుతున్నట్లు తెలిపారు. అదే సమయంలో రోగులకు మౌలిక వసతులు పెంచాల్సిన అవసరమూ ఉంది.               
   – డాక్టర్‌ జగన్నాథ్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి

మరిన్ని వార్తలు