పేలుళ్ల విస్ఫోటం

10 Mar, 2017 01:22 IST|Sakshi
పేలుళ్ల విస్ఫోటం

అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన గ్యాస్‌ లారీ
చెట్టి విరిగి విద్యుత్‌లైన్‌పై పడటంతో రేగిన మంటలు


విశాఖపట్టణం (భీమిలి): నగర శివారులో ఆనందపురం మండలం గుడిలోవ వద్ద మంగళవారం అర్థరాత్రి ఒక లారీ మంటలకు ఆహుతి కావడం.. అందులో ఉన్న సిలిండర్లు పేలిపోయిన ఘటన బీభత్సం సృష్టించింది. పరవాడ వద్ద ఉన్న భారత్‌ గ్యాస్‌ గొడౌన్‌ నుంచి 306 గ్యాస్‌ సిలిండర్లను లారీలో లోడ్‌ చేసుకొని డ్రైవర్‌ నాగేశ్వరరావు పెందుర్తి మీదుగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి తీసుకెళ్తున్నాడు. గుడిలోవ వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి అడ్డంగా రావడంతో.. అతన్ని తప్పించేందుకు డ్రైవర్‌ ప్రయత్నించే క్రమంలో లారీ రోడ్డు పక్కనున్న తాటిచెట్టును ఢీకొట్టింది. దాంతో తాటిచెట్టు విరిగిపోయి పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్‌ లైనుపై పడటంతో మంటలు రేగాయి. అదే సమయంలో లారీ నుంచి లీకైన డీజిల్‌ అంటుకొని మంటలు లారీని కమ్మేశాయి. మంటల వేడికి లారీలో ఉన్న సిలిండర్లలో గ్యాస్‌ ఒత్తిడి పెరిగి ఒక్కొక్కటిగా పేలడం ప్రారంభించాయి.

మూడు గంటలపాటు పేలుళ్లు
ఏకధాటిగా మూడు గంటలపాటు కొనసాగిన ఈ పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాంతాలన్నీ అదిరిపోయాయి. నిద్రపోతున్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈలోగా లారీకి మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ లారీ నుంచి దూకేసి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. అయితే మంటల తీవ్రత కారణంగా లారీ సమీపంలోకి వెళ్లలేక దూరం నుంచే మర్రిపాలెం, తాళ్లవలస నుంచి వచ్చిన నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. తెల్లవారుజాముకు గానీ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో లార్తీ పూర్తిగా కాలిపోయి ఆనవాలు లేకుండాపోయింది.

4 గంటలపాటు ట్రాఫిక్‌ నిలిపివేత
ప్రమాద తీవ్రతను గమనించిన పోలీసులు ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. వాహనాలను ఇతర మార్టాల్లోకి మళ్లించారు. సుమారు 4 గంటలపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న నగర పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్, ఏసీపీ బి.వి.ఎస్‌.నాగేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి మోహనరావు, స్థానిక సీఐ ఆర్‌.గోవిందరావు, తహసీల్దారు ఎస్‌.వి.అంబేద్కర్‌లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. లారీ పూర్తిగా దగ్ధం కావడంతోపాటు సిలిండర్లు పేలిపోవడంతో సుమారు రూ. 20 లక్షల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.

నిషేధ సమయంలో సిలిండర్ల తరలింపు
పేలుడు స్వభావం గల వస్తువులు, పదార్థాలను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు మాత్రమే రవాణా చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ప్రమాదానికి గురైన లారీ అర్ధరాత్రి వేళ నిబంధనలను అతిక్రమించి సిలిండర్లను నగరం మీదుగా శివారు ప్రాంతానికి ఎలా చేరుకుందన్న విషయం చర్చనీయాంశమైంది. అలాగే సిలిండర్లను చట్టబద్దంగానే తరలిస్తున్నారా లేదా బ్లాక్‌లో తరలిస్తున్నారా అన్న అనుమానాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాహనాల ద్వారా భారీగా సరుకులు రవాణా చేసేటప్పుడు తప్పకుండా సహాయకులను పంపిస్తారు. కానీ ఈ లారీతో ఒక్క డ్రైవరే ఉన్నాడు. మతిస్థిమితం లేని వ్యక్తిని తప్పించబోయి చెట్టును ఢీకొట్టానని డ్రైవర్‌ చెబుతున్నాడు. కానీ నిర్ణీత వేగంతో వస్తే లారీని అదుపు చేసే అవకాశం ఉంది. అందువల్ల మితి మీరిన వేగం కానీ.. డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడం కానీ జరిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అటు బంక్‌.. ఇటు గ్రామం
ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో ఒకపక్క తర్లువాడ గ్రామం.. మరోపక్క పెట్రోల్‌ బంక్‌ ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ ఒక్కదానికి చేరువలో ఈ ప్రమాదం జరిగినా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లేది. పెట్రోలు బంక్‌కు ఆనుకొని చాలా తోటలు ఉన్నాయి. మంటలు చెలరేగి ఉంటే అపార నష్టం జరిగి ఉండేదని సంఘట స్థలాన్ని చూసిన స్థానికులు ఆందోళనతో చెప్పారు.

మరిన్ని వార్తలు