లాఠీ దాష్టీకం

10 Dec, 2016 00:06 IST|Sakshi
లాఠీ దాష్టీకం
దివీస్‌ కోసం పోలీసుల అతి.. అట్టుడికిన కోన తీరం
బందోబస్తుతో రైతుల భూముల్లో చెట్ల తొలగింపు
కోర్టు స్టే ఉన్న, అమ్మని భూముల్లో పనులపై ప్రజల ఆగ్రహం
గ్రామాల్లో మహిళలపై  దౌర్జన్యం
అడ్డుకున్న 100 మంది అరెస్టు 
బాధితులను విడిపించిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
తొండంగి : జీడిచెట్ల వద్ద పిక్కలు ఏరుకుంటూ, గొర్రెల మందలను కాచుకుంటూ జీవనం సాగించే కోనతీరంలోని అమాయక ప్రజలపై కాలుష్య దివీస్‌ పరిశ్రమ కోసం ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం దివీస్‌ ల్యాబొరేటరీస్‌ పరిశ్రమ స్థాపన కోసం కోనఫారెస్ట్‌ భూములు 670 ఎకరాలను కేటాయించింది. ఈ భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతులు, బాధిత గ్రామాల ప్రజల కాలుష్య పరిశ్రమ స్థాపనను, భూముల కేటాయింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేసే పోరుకు  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం.ఎల్), జనశక్తి, ఏపీ వ్యవసాయరైతు కూలీసంఘం, సీఐటీయూ, ఐద్వా మహిళాసంఘం తదితర సంఘాలు, పార్టీల మద్దతునిస్తున్నారు. రెవెన్యూ అధికారులు పలుమార్లు  రైతులు ప్రభుత్వానికి అప్పగించని భూముల్లో బలవంతంగా చెట్లను తొలగించబోతుంటే బాధిత గ్రామాల ప్రజలు  ప్రతిఘటిస్తూనే ఉన్నారు. శుక్రవారం కూడా రెవెన్యూ అధికారులు భారీగా జేసీబీలు, కోత యంత్రాలతో చెట్లను తొలగించారు. విషయం తెలుసుకున్నతాటియాకులపాలెం, కొత్తపాకలు, పంపాదిపేట తదితర గ్రామాలకు చెందిన వారంతా తమ భూముల్లోకి వెళ్లి చెట్లుతొలగిస్తున్న జేసీబీ, కోత యంత్రాలను నిలుపుదల చేయించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని బలవంతంగా వ్యానులో ఎక్కించి అరెస్టు చేశారు. తాటియాకులపాలెం రైతు సన్ని సత్యనారాయణను పోలీసులు దారుణంగా కొట్టడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సుమారు 100 మందిని కోటనందూరు, అన్నవరం, ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 
 దివీస్‌ కోసం బలవంతపు భూసేకరణకు చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో కోన తీరప్రాంతంలో బాధిత గ్రామాల వద్ద సుమారు వెయ్యిమంది పోలీసులను మోహరించారు.
మానవత్వాన్ని మరిచి..
పోలీసులు మానవత్వాన్ని మరచి బహిర్భూమికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలు, రోడ్డుకు సమీపంలో చదువుకుంటున్న విద్యార్థులు, యువతులు, బీచ్‌రోడ్డు ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరిపై ధాషీ్టకాన్ని ప్రదర్శించారు.   పంపాదిపేటలో బీచ్‌రోడ్డుకు ఆవల ఉన్న పశువుల మకాంలోకి, ఇళ్ల వద్దకు వెళ్తున్న మహిళలను  అరెస్టు చేశారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ జీపుల్లో ఎక్కించారు. 
బాధితులకు అండగా ఎమ్మెల్యే రాజా
అరెస్టుల విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బాధిత ప్రజలకు అండగా నిలిచారు. అరెస్టు సంఘటనలు తెలిసిన వెంటనే ఆయన కొత్తపాకలు సమీపంలో దివీస్‌కు ప్రతిపాదిత భూములు వద్దకు వెళ్లారు. దీంతో బాధిత రైతులంతా అక్కడకు చేరుకున్నారు. హైకొర్టు స్టేటస్కో విధించిన భూముల్లోనూ పనులు నిర్వహించారని, అడ్డువచ్చిన ప్రతి ఒక్కరినీ కొట్టి అరెస్టు చేశారని రైతులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. దీంతో అక్కడ ఉన్న డీఎస్పీ రాజశేఖర్‌తో ఎమ్మెల్యే మాట్లాడారు. దివీస్‌కు ప్రతిపాదించిన భూముల్లో వాస్తవంగా రైతుల నుంచి కొనుగోలు చేసినది ఎంత, అమ్మని భూమి ఎంత ఉందో రెవెన్యూ అధికారులు గుర్తించి, అవసరమైతే సర్వే నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజా అన్నారు. తక్షణమే పనులు నిలిపివేయాలని డీఎస్పీని కోరారు. లేదంటే వారి తరఫున ధర్నాకు దిగుతానని హెచ్చరించారు.
అరెస్టయినవారిని విడిపించిన ఎమ్మెల్యే
ఈ సందర్భంగా 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అన్నవరం పోలీస్‌స్టేషన్‌కు 32 మందిని, కోటనందూరు 66 మందిని, ఒంటిమామిడిపోలీస్‌స్టేషన్‌కు ఇద్దరిని వాహనాల్లో తరలించారు. డీఎస్పీతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే రాజా వారిని అక్కడి నుంచి బయటకు పంపించారు. 
 
మరిన్ని వార్తలు