టేకు చెట్టుపై గొడ్డలి వేటు

27 Jul, 2016 23:29 IST|Sakshi
టేకు చెట్టుపై గొడ్డలి వేటు
నేరడిగొండ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మెుక్కలు నాటాలని చెబుతున్నా ప్రభుత్వం అడవులను నాశనం చేసే వారిని మాత్రం అదుపు చేయలేకపోతోంది. ఫలితంగా ఓ వైపు నాటుడు..మరోవైపు నరుకుడు కార్యక్రమం యథేచ్ఛగా కొనసాగుతోంది. బోథ్‌ అటవీ రేంజ్‌లో పచ్చని టేకు చెట్లపై నిత్యం గొడ్డలి వేటు పడుతోంది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బోథ్‌ రేంజ్‌లో అధికారుల పర్యవేక్షణ లేక స్మగ్లర్లు దర్జాగా అడవుల్లోకి వెళ్లి టేకు చెట్లు నరికివేస్తునారు. ఇక్కడ ఉన్న టేకు వనం మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. దీంతో స్మగ్లర్లు ఇక్కడి టేకుపై కన్నేశారు. దీంతో స్మగ్లర్ల వేటుకు పెద్ద పెద్ద టేకు వక్షాలు నేలకొరిగి మొదళ్లు దర్శనమిస్తున్నాయి. బోథ్‌ రేంజ్‌ పరిధిలోని పీచర, బోరిగాం, ఈస్పూర్, నాగమాల్యాల్, అద్దాలతిమ్మాపూర్, గోవింద్‌పూర్, మర్లపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసిన చెట్ల నరికివేత కనిపిస్తోంది. వాటిని చూస్తే ఇటీవలే నరికి వేసినట్లు తెలుస్తోంది. అడుగడుగునా కనిపిస్తున్న చెట్లమొదళ్లతో కలప భారీగా రవాణా అయినట్లు తెలుస్తోంది. అడవులను రక్షించాల్సిన అధికారుల్లో కొందరు పరోక్షంగా స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ఇల్లు కడితే అధికారులకు పండుగే..
బోథ్, సోనాల, కౌట, పొచ్చెర, కనుగుట్ట, నేరడిగొండ, వడూర్, కుమారి, తదితర గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యిందంటే చాలు కొందరు అటవీ అధికారులకు పండుగ వచ్చినట్టే. దర్వాజలు, కిటì కీలు, తలుపులకు రూ.20వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తూ రూ.10వేల నుంచి  20వేల వరకు రసీదులు ఇచ్చి మిగతాది జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
చర్యలు తీసుకుంటున్నాం
అడవిలో చెట్ల నరికివేత జరగడం లేదు. ఎప్పుడో నరికేసిన మొదళ్లు మాత్రమే ఉన్నాయి.  స్మగ్లింగ్‌ నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. 
– మనోహర్, బోథ్‌ రేంజ్‌ అధికారి  
 
 
మరిన్ని వార్తలు