ఇక పాఠశాలలు లేనట్టే?

5 Nov, 2016 04:59 IST|Sakshi
ఇక పాఠశాలలు లేనట్టే?

సీతంపేట : ఏజెన్సీలోని గిరిజన విద్యార్థులకు ప్రాథమిక విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయేలా ఉంది. వీరి కోసం ప్రత్యేక పాఠశాలలంటూ చెప్పిన ప్రభుత్వం విఫలమైంది. పది మందిలోపు విద్యార్థులున్న గ్రామాల్లో పాఠశాలలు మంజూరు చేయడంలో సర్వశిక్షాభియాన్ చేతులెత్తేసింది. దీంతో గిరిజన గ్రామాల్లో చిన్నారులు డ్రాపౌట్లు సంఖ్య పెరుగుతుంది. గతంలో ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ(నాన్‌రెసిడెన్షియల్ ట్రైనింగ్ సెంటర్) కేంద్రాలను ఏజెన్సీలో ప్రవేశపెట్టి డ్రాపౌట్లను నివారణకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఫలితం లేదు. ఈ కోవలోనే 46 వరకు ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ కేంద్రాలు మంజూరయ్యాయని ఐటీడీఏలో విద్యాశాఖాధికారులు ఇటీవల చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో 10 నుంచి 20 మంది విద్యార్థులున్న చోట 21 పాఠశాలలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టనున్నామని చెబుతున్నారు. పది మందిలోపు విద్యార్థులున్న గ్రామాలే ఏజెన్సీలో 50కి పైగా ఉంటారుు. ఆయా గ్రామాల్లో పాఠశాలలు లేకపోవడంతో వీటిలో దాదాపు ఐటీడీఏ పరిధిలో 1500ల మంది వరకు డ్రాపౌటు విద్యార్థులు ఉంటారు. వీరికి మరి చదువులు చదువుకునే పరిస్థితి లేదు.
 
 ఎదురు చూపులు
 విద్యా సంవత్సరం ఆరంభమై ఆరు నెలలవుతున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు చదువులు లేకపోవడం శోచనీయం. కొండ శిఖరాల గ్రామాల్లో విద్యార్థులు మైదాన ప్రాంతాలకు పాఠశాలలకు వెళ్లాలంటే కష్టాలు తప్పడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ గ్రామంలో పాఠశాల ఉండి తప్పనిసరిగా బడిఈడు పిల్లలంతా బడిలో ఉండాలనే నిబంధనలున్నాయి. పాఠశాలలు లేకపోవడంతో విద్యార్థులంతా పశువుల కాపరులు, తల్లిదండ్రులతో పోడు పనులకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్.ద్వారబందం అనే గ్రామంలో 12 మంది, రంగంవలస, నాయికమ్మగూడ, చాపరాయిగూడ,  మందస మండలంలోని కొంటిసాయి, చింతవీధి, కొత్తూరు మండలంలో చిన్నరాజపురం, దాపకులగూడ, ఉల్లిమానుగూడ, మెళియాపుట్టి మండలంలో రామచంద్రాపురం, భామిని మండలంలో బాండ్రాసింగి, నడింగూడ, కొత్తగూడ, గేదెలగూడ, మాండ్రంగూడ, బూర్జ మండలంలో గోపిదేవిపేట, బొమ్మిక తదితర గ్రామాల్లో పాఠశాలల్లేవు. దాదాపు 70 గ్రామాల్లో పాఠశాలలు లేవంటే ప్రాథమిక విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఏపాటిదో అర్ధమవుతుంది.
 

మరిన్ని వార్తలు