ఎవరెస్టుపై మెరిసిన మరో మన్యం వీరుడు

14 May, 2017 23:06 IST|Sakshi
ఎవరెస్టుపై మెరిసిన మరో మన్యం వీరుడు
కుంజవారి గూడెం ఖ్యాతిని పెంచిన దుర్గారావు
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండో గిరిజనుడు
చింతూరు (రంపచోడవరం):  ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి భారత పతాకాన్ని రెపరెపలాడించడంతో పాటు రాష్ట్రం, జిల్లా పేరును ఇనుమడింపజేశాడు కుంజా దుర్గారావు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన రెండో పర్వతారోహకుడిగా పేరుగడించాడు. వీఆర్‌పురం మండలం కుంజవారిగూడెం గ్రామానికి చెందిన 18 ఏళ్ల కుంజా దుర్గారావు . శనివారం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. గిరిజన కుటుంబానికి చెందిన దుర్గారావు తండ్రి పిచ్చిరెడ్డి, తల్లి లచ్చమ్మ గ్రామంలోనే  వ్యవసాయం చేసుకుంటూ, పూరిపాకలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. దుర్గారావుకు అన్న కల్యాణ్, ఇద్దరు సోదరిలు ఉన్నారు.  తాము నిరక్షరాస్యులమైనా తమ బిడ్డల్ని పెద్ద చదువులు చదివించాలనే కుమారులిద్దర్నీ చదివిస్తున్నట్టు తండ్రి పిచ్చిరెడ్డి తెలిపాడు. కల్యాణ్‌ డిగ్రీ చదువుతుండగా దుర్గారావు మారేడుమిల్లి గురుకుల కళాశాలలో ఈ ఏడాది ఇంటర్‌ సెకండియర్‌ పాసయ్యాడు. 
 క్రీడలంటే ప్రాణం
మా ఇద్దరికీ  క్రీడలంటే ఎంతో ప్రాణమని, ప్రధానంగా వాలీబాల్‌ ఆడేవారమని దుర్గారావు సోదరుడు కల్యాణ్ తెలిపాడు. క్రీడల పట్ల ఉన్న ఆసక్తే తన తమ్ముడిని పర్వతారోహణ వైపు ఆకర్షితుడిని చేసిందన్నాడు. ఎవరెస్టు అధిరోహించిన దూబి భద్రయ్యను ఆదర్శంగా తీసుకుని తాను కూడా ఎవరెస్టు అధిరోహించాలని ఆకాంక్షించాడని అతను తెలిపాడు. రంపచోడవరం ఐటీడీఏ సహకారంతో దూబి భద్రయ్య శిక్షణలో గతేడాది డిసెంబర్‌లో దుర్గారావు రెనాక్‌ పర్వతం అధిరోహించాడని అదేనెలలో చింతూరులో శిక్షణా కార్యక్రమం జరిగిందని తెలిపాడు. అనంతరం జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌ పర్వతాన్ని అధిరోహించాడని కల్యాణ్ తెలిపాడు. అందులో ప్రతిభ కనబరచిన దుర్గారావుతో సహా ఆరుగురు శనివారం ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారని వివరించాడు. 45 రోజుల్లో అధిరోహించాల్సిన శిఖరాన్ని కేవలం 30 రోజుల్లోనే అధిరోహించి వారు రికార్డు సృష్టించారని కళ్యాణ్‌ తెలిపాడు. చిన్నకొడుకు దుర్గారావు ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించాడనే ఆనందం ఒకవైపు పెద్దకొడుకు కళ్యాణ్‌ శుక్రవారం విడుదలైన కానిస్టేబుల్‌ సెలక్షన్‌లో ఎంపికయ్యాడనే ఆనందం వారి తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమ వాడు ఎవరెస్ట్‌ అధిరోహించాడనే విషయం ఆదివారం ఉదయం తమకు తెలిసిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంటిల్లిపాదీ ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
జిల్లా నుంచి రెండోవాడు
 గతంలో చింతూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దూబి భద్రయ్య  మనజిల్లా నుంచి ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి గిరిజనుడిగా పేరు గడించాడు. దీంతో ఐటీడీఏ అతనిని రాష్ట్రంలోని గురుకుల కళాశాలల్లో చదువుతున్న యువతకు పర్వతారోహణలో శిక్షణ ఇచ్చే శిక్షకుడిగా నియమించింది. అతని శిక్షణలోనే కుంజా దుర్గారావు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండో యువకుడిగా గురువు పేరు నిలబెట్టాడు. 
పలువురి అభినందన
దుర్గారావు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం పట్ల రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, చింతూరు ఐటీడీఏ పీఓ గుగ్గిలి చినబాబు అభినందనలు తెలియజేశారు. పంచాయతీ సర్పంచ్‌ రవ్వ సుజాత, గ్రామస్తులు కూడా దుర్గారావును అభినందించారు.
ఎంతో ఆనందంగా వుంది 
నాబిడ్డ ఏదో కొండ ఎక్కాడని నా పెద్దకొడుకు చెప్పాడు. ఎవరెవరో వచ్చి అభినందనలు చెబుతున్నారు. ఎంతో ఆనందంగా వుంది. వాడిని ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను.
-కుంజా లచ్చమ్మ, దుర్గారావు తల్లి
మరిన్ని వార్తలు