పునర్విభజన లొల్లి

1 Sep, 2016 20:46 IST|Sakshi
పునర్విభజన లొల్లి
  • జిల్లావ్యాప్తంగా ఆందోళనలు
  • ఉధృతమవుతున్న ఉద్యమాలు
  • సంకట స్థితిలో గులాబీ నేతలు
  • పూలు చల్లిన చోటే రాళ్లు
  • రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు
  • కరీంనగర్‌ సిటీ : జిల్లాల పునర్విభజన మంటలు అంతటా రాజుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు ఉధృతమయ్యాయి. జిల్లా, డివిజన్, మండల సాధన కమిటీలు, జేఏసీలు పుట్టుకొచ్చి అచ్చం తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటాలు నిర్వహిస్తున్నాయి. దీనికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. దీంతో పూలు చల్లిన చోటే రాళ్లు పడుతున్న చందంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రస్తుత పరిస్థితి సంకటంగా మారింది.
    భగ్గుమన్న సిరిసిల్ల
    పునర్విభజనలో భాగంగా కరీంనగర్‌ జిల్లాను కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతనెల 22న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముందునుంచి ప్రచారంలో ఉన్నట్లు సిరిసిల్లకు బదులు అనూహ్యంగా పెద్దపల్లి జిల్లా తెరపైకి రావడంతో సిరిసిల్ల ప్రాంతం భగ్గుమన్నది. అప్పటివరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన చోటే దిష్టిబొమ్మల దహనానికి పూనుకున్నారు. హోర్డింగ్‌ల్లో మంత్రి ఫొటో ఉన్నా ధ్వంసం చేసేంతటి ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సహజంగానే ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. అన్ని పార్టీలు, న్యాయవాదులు, కులసంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమ తరహాలోనే జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఆందోళనలను ఉధృతం చేస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా సాధన సెగ చివరకు రాష్ట్ర రాజధానికి సైతం తాకింది. మెున్నటి అసెంబ్లీ సమావేశం సందర్భంగా హైదరాబాద్‌లో జేఏసీ నాయకులను అరెస్ట్‌ చేయడంతో 48 గంటల బంద్‌ జరిగింది. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం జిల్లా సాధన కోసం ప్రత్యక్ష ఉద్యమంలోకి అడుగుపెట్టక తప్పలేదు. జేఏసీతో కలవకుండా వేరుకుంపటి పెట్టి రిలేదీక్షల పేరిట ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. చివరకు కేసీఆర్‌ కుటుంబసభ్యులు కూడా ఈ ఆందోళనలకు సంఘీభావం తెలపాల్సిన పరిస్థితి సిరిసిల్లలో నెలకొంది. ఉద్యమ ఉధృతికి ప్రభుత్వం తలొగ్గక తప్పదనే ధీమాతో జేఏసీ ఉండగా, ప్రభుత్వం సైతం పునరాలోచనలో పడిందనే ప్రచారం జరుగుతోంది.
     తెరపైకి పీవీ జిల్లా.. 
    హన్మకొండను జిల్లా చేయొద్దంటూ ఆందోళనలు కొనసాగుతుండగా, తాజాగా హుజూరాబాద్‌ జిల్లా తెరపైకి వచ్చింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట హుజూరాబాద్‌ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలంటూ గత నాలుగు రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. హన్మకొండ జిల్లాలోకి ప్రతిపాదించిన హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలతో పాటు ప్రస్తుత వరంగల్‌ జిల్లాలోని పలు మండలాలను కలిపి జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
    కదులుతున్న కోరుట్ల 
    వచ్చినట్లే వచ్చి చేజారి పోయిన రెవెన్యూ డివిజన్‌ సాధన కోసం కోరుట్ల ప్రాంత ప్రజలు ఏకమై కదులుతున్నారు. రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలంటూ కోరుట్లలో జరుగుతున్న ఆందోళన ఉధృతమైంది. తమ ప్రాంతానికి సరైన ప్రజాప్రతినిధులు లేకపోవడంతోనే రెవెన్యూ డివిజన్‌ రాత్రికి రాత్రి మెట్‌పల్లికి మారిపోయిందని భావిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డివిజన్‌ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌లోనూ దీక్షలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. ఇటీవల నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి డివిజన్‌ గురించి విన్నవించారు. రెండు రోజుల పట్టణ బంద్‌ విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. మెట్‌పల్లికి చెందిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ల తీరును నిరసిస్తూ వారి దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. 
    – భూపాలపల్లి జిల్లాలోకి పోతున్న కాటారం, మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం మండలాలతో కాటారం కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన మొదలైంది. చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లితో పాటు కొత్తగా ఏర్పడే కొత్తపల్లి మండలాన్ని కలుపుకొని చొప్పదండి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్ష నాయకులు రెండు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. 
    జఠిలంగా హుస్నాబాద్‌ 
    మూడు ముక్కలైన హుస్నాబాద్‌ నియోజకర్గంలో పరిస్థితి రోజురోజుకు జఠిలంగా మారుతోంది. నియోజకవర్గంలోని మండలాలు కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల్లోకి పోవడాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రాంత వాసులు ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌ జిల్లాలోనే కొనసాగించాలని ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. గృహనిర్భంధం చేస్తామంటూ హెచ్చరిస్తూ టీఆర్‌ఎస్‌ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే క్రమంలో సిద్దిపేటలో కలిపిన ఇల్లంతకుంట, బెజ్జంకిలను కరీంనగర్‌లోనే కొనసాగించాలంటూ పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టారు. జగిత్యాలలో కలిపిన తమను పెద్దపల్లి జిల్లాలో చేర్చాలంటూ వెల్గటూరు మండలం రాజారాంపల్లి గ్రామస్తులు, కాల్వశ్రీరాంపూర్‌ మండలాన్ని మంథని రెవెన్యూడివిజన్‌లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత వాసులు ఆందోళన చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కొత్తపల్లి మండలంలో తమను కలపాలంటూ రామడుగు మండలం వన్నారం, దేశరాజ్‌పల్లి, కొక్కెరకుంట గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. 
    మండలాల కోసం ఆందోళనలు
    జిల్లాలో కనీసం పది మండలాలు కొత్తగా ఏర్పడుతాయని ప్రచారం జరిగినా, ప్రభుత్వం కేవలం కొత్తపల్లి, కరీంనగర్‌ రూరల్, అంతర్గాం, ఇల్లందకుంట... నాలుగు మండలాలతోనే సరిపెట్టింది. దీంతో మండలాల కోసం ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా రోడ్డెక్కారు. సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి, కమాన్‌పూర్‌ మండలం రత్నాపూర్, కోరుట్ల మండలం ఐలాపూర్, ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి, రామగుండం మండలం బసంత్‌నగర్, జమ్మికుంట మండలం వావిలాల, భీమదేవరపల్లి మండలం కొత్తకొండను కొత్త మండలాలు చేయాలంటూ ఆయా ప్రాంతాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బసంత్‌నగర్‌కు చెందిన ఇండోర్‌ జిల్లా కలెక్టర్‌ నరహరి ఆందోళనలకు సంఘీభావాన్ని ప్రకటించి, బసంత్‌నగర్‌ను మండలంగా ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్‌ నీతూప్రసాద్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
    అభ్యంతరాల వెల్లువ
    డ్రాఫ్ట్‌ నోటిఫికే షన్‌లో అభ్యంతరాలు తెలపాలంటూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆయా ప్రాంతాల్లోని ఉద్యమకారులు అనుకూలంగా మలుచుకొనే పనిలో పడ్డారు. ఇంటర్నెట్‌ కేంద్రాల్లో మకాం వేసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అభ్యంతరాలు పంపించే పనిని కొంతమంది నాయకులకు ప్రత్యేకంగా అప్పగించారు. వేల సంఖ్యలో అభ్యంతరాలు వెళితే ప్రభుత్వం నిర్ణయం మార్చుకొనే అవకాశం ఉందంటూ ప్రచారం చేయడంతో స్వచ్చందంగానూ అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మెయిల్స్‌ పంపిస్తున్నారు.
    అధికార పార్టీకి సంకట స్థితి
    ఎంకి  పెళ్లి సుబ్బి చావుకొచ్చిన విధంగా... కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి సరికొత్త సంకట స్థితిని తీసుకొంది. రాజకీయంగా జిల్లాలో ఎదురులేకుండా కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌కు తామే తెచ్చిపెట్టుకున్న పునర్విభజన అంశం రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం చూపే స్థాయికి చేరుకోవడం పార్టీ నేతలను కలవరపరుస్తోంది. మొన్నటి వరకు పూలు చల్లిన చేతులతోనే రాళ్లు వేస్తుండగా, కీర్తిస్తూ పాటలు పాడిన నోళ్లతోనే కించపరుస్తూ పేరడీ పాటలతో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. సిరిసిల్ల ప్రాంతంలో తిరుగులేని శక్తిలా ఎదిగిన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు జిల్లా సమస్య తీవ్ర ఇబ్బందికరంగా మారింది. సిరిసిల్ల జిల్లా కాకపోవడంతో కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్షాలు పావులు కదపడంతో నిత్యం దిష్టిబొమ్మలు దగ్ధమవుతున్నాయి. అక్కడక్కడా అధికార పార్టీకి, జేఏసీ ప్రతినిధులకు నడుమ వాగ్వాదాలు చోటుచేసుకొంటున్నాయి. ఒకవేళ ఒత్తిడికి తలొగ్గి సిరిసిల్లను జిల్లాగా చేస్తే పెద్దపల్లి భవిష్యత్‌ ఏంటనే ప్రశ్న ఉత్కంఠను రేపుతోంది. సిరిసిల్ల జిల్లా అయితే పెద్దపల్లి రద్దవుతుందనే ఊహాగానాలతో అప్పుడే పెద్దపల్లిలో అఖిలపక్షం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హన్మకొండ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండడంతో, పెద్దపల్లి రద్దుకాకుండానే సిరిసిల్ల ఏర్పడుతుందంటూ మరికొంతమంది వాదిస్తున్నారు.  
మరిన్ని వార్తలు