టీఆర్‌ఎస్‌ది నిరంకుశ పాలన

26 Jul, 2016 23:17 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ది నిరంకుశ పాలన
తుర్కపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంకుశ పాలన సాగిస్తూ రైతులపైన లాఠీచార్జి, కాల్పులు జరిపిస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని మాజీమంత్రి, పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం మెదక్‌ జిల్లాలోని మల్లన్నసాగర్‌ నిర్వాసితులను పరామర్శించడానికి వెళ్లిన ఆయనను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేసి నల్లగొండ జిల్లా తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. 4 గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013 చట్టానికి మద్దతు తెలిపి పార్లమెంట్‌లో ఓటేసిన కేసీఆర్‌ నేడు 123 జీఓ పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. మల్లన్నసాగర్‌పై అసెంబ్లీ చర్చచకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కోరినా ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. 2013 చట్టం ప్రకారం రైతులను ఆదుకోవాల్సి ప్రభుత్వం.. వారి జీవితాలతో చలగాటమాడుతోందని ఆరోపించారు. రైతులకు న్యాయం చేస్తే వరకు కాంగ్రెస్‌ పార్టీ వారి పక్షాన నిలిచి పోరాడుతుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కల్వకుంట్ల రమ్యరావు, బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, తంగెళ్ల రవికుమార్, పొత్నక్‌ ప్రమోద్‌కుమార్, ఉదయ్‌చందర్‌రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు