కోదండరాంను విమర్శించడం టీఆర్‌ఎస్ అవివేకం

9 Jun, 2016 08:57 IST|Sakshi
కోదండరాంను విమర్శించడం టీఆర్‌ఎస్ అవివేకం

నెన్నెల : తెలంగాణ రాష్ట్ర సాధన రాజకీయ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాంను టీఆర్‌ఎస్ శ్రేణులు విమర్శించడం వారి అవివేకమని సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి రత్నం తిరుపతి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మాట్లాడిన విధానం సరైందికాదన్నారు. ఉస్మానియా క్యాంపస్‌లో కోదండరాం వెనుక తిరిగినప్పుడు ఆయన గురించి తెలియదా అని ప్రశ్నించారు. కేవలం పదవి వ్యామోహంతో కేసీఆర్ వద్ద మెప్పుపొందేందుకు టీఆర్‌ఎస్ నాయకులు కోదండరాంను విమర్శిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముందుండి నడిచిన కోదండరాంపై విమర్శలు చేసే ముందు టీఆర్‌ఎస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

అన్ని పార్టీలు, కుల సంఘాలను ఒకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కోదండరాంపై చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి విమర్శలు మాని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు చంద్రయ్య, నాయకులు జోసఫ్, మల్లేశ్, లింగయ్య తదితరులు ఉన్నారు.


కోదండరాంను విమర్శించడం సరికాదు
భైంసారూరల్ : తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను విమర్శించడం సరికాదని టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.ముష్కం రామకృష్ణాగౌడ్ అన్నారు. బుధవారం భైంసాలోని డాక్టర్స్ అసోసియేషన్ భవనంలో సీపీఐఎంఎల్ నాయకులు రాజు, యువజన సంఘాల కార్యదర్శి సుదర్శన్, బోసి మస్తాన్, టీవీవీ భైంసా మండల అధ్యక్షుడు చాకెటి లస్మన్నతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.

తెలంగాణ విద్యావంతులవేదిక ఏర్పాటు చేసిన ‘రెండేళ్ల తెలంగాణ - ప్రజల ఆకాంక్ష - ప్రభుత్వ తీరుతెన్నులు’ సెమినార్‌లో ముఖ్యఅతిథిగాపాల్గొని పది జిల్లాల్లో తన పర్యటనతో ప్రజలు పడుతున్నబాధలను కోదండరాం వ్యక్తపరిచారన్నారు. ప్రజల బాధలను ప్రత్యక్షంగా చూసి ఆ విషయాన్ని సెమినార్‌లో వ్యక్తపరిస్తే టీఆర్‌ఎస్ నాయకులు ఏకదాటిగా సంస్కారహీనమైన భాషను ఉపయోగించి కోదండరాంను విమర్శించడం సరికాదన్నారు.

మరిన్ని వార్తలు