ఆశల పల్లకిలో..

19 Mar, 2016 03:29 IST|Sakshi
ఆశల పల్లకిలో..

పదవుల పంపకానికి మళ్లీ ముహూర్తం
ఏప్రిల్‌లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ
సమాచారాన్ని సేకరిస్తున్న సర్కారు
అధిష్టానం చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నామినేటెడ్ పోస్టులపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పదవుల పంపకానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మరోసారి ముహూర్తం ఖరారు చేయడంతో ఆశావహుల్లో అలజడి మొదలైంది. పక్షం రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని శుక్రవారం జరిగిన శాసనసభపక్ష పార్టీ సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయపై  దృష్టి సారించాల్సి ఉన్నందున ఆ లోపు పదవులను పంచేయాలని నిర్దేశించారు. దీంతో అధికారపార్టీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పదవులపై గంపెడాశ పెట్టుకున్న సీని యర్లు, దిగువశ్రేణి నాయకులు వ్యూ హాలకు పదును పెడుతున్నారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో పోస్టుల కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు.

 పోస్టులపై లెక్క!
జిల్లాలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. శాఖలవారీగా ఎన్ని నామినేటెడ్ పదవులున్నాయో లెక్క తీస్తోంది. ఈ జాబితా ఆధారంగా పదవుల కూర్పు చేపట్టాలని భావిస్తోంది. తక్షణమే మార్కెట్ కమిటీలు, జిల్లా, నియోజకవర్గస్థాయి ఆస్పత్రులు, దేవాదాయ, వక్ఫ్ బోర్డు, ఆహార సలహా సంఘం, రవాణా, గ్రంథాలయ, హాకా తదితర సంస్థల చైర్మన్లు, డెరైక్టర్ల పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పదవుల పంపకంలో జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రాధాన్యమివ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో పోస్టుల రేసులో ఉన్న నేతాగణం వీరిని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 కత్తిమీద సామే!
పదవుల పంపకం గులాబీ నాయకత్వానికి కత్తిమీద సాముగా మారింది. 20 నెలలుగా పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలను ఎప్పటికప్పుడు బుజ్జగిస్తూ వచ్చిన అధిష్టానానికి తాజాగా కొత్త నాయకుల చేరిక తలనొప్పులు తెచ్చిపెట్టింది. సామాజిక సమీకరణలు, మారిన పరిణామాలకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. పార్టీ ఆవిర్భా వం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పలువురు నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. రిజర్వేషన్ల కారణంగా పోటీచేయలేని పరిస్థితి తలెత్తిన ద్వితీయశ్రేణి నాయకులు కూడా వీటిపై కన్నేశారు. వీరిలో అధికశాతం మందికి పార్టీ పదవుల్లోనో, నామినేటెడ్ పోస్టుల్లోనో ప్రాధాన్యమిస్తామని నమ్మబలుకుతూ వచ్చిన టీఆర్‌ఎస్ అ ధిష్టానానికి ఆపరేషన్ ఆకర్ష్‌తో ఇతర పార్టీల నుంచి వ లస వచ్చిన నేతల రూపంలో గట్టి సవాల్ ఎదురవుతోం ది. మొదటి నుంచి పనిచేసిన నాయకులకంటే.. ఇటీవల పార్టీలో చేరిన నేతలు అన్ని విధాలా సమర్థు లు కావడంతో పాతవారికి ఎలా న్యా యం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. దీనికితోడు సామాజికవర్గాల సమతుల్యత, స్థానిక నాయకత్వానికి ఆమోదయోగ్యమైనవారికే ప దవులు కట్టబెట్టాలనే అధిష్టానం సూ చనలు కూడా అధికారపార్టీకి ఒకింత చికాకు కలిగించే అంశాలు కానున్నాయి.

మరిన్ని వార్తలు