ప్రజల్లోకి వెళ్లాలి

25 Apr, 2017 18:22 IST|Sakshi
ప్రజల్లోకి వెళ్లాలి

► వచ్చే నెల మొదటివారంలో గ్రామగ్రామాన పర్యటన
► ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
► మంత్రి ఈటల రాజేందర్‌


జమ్మికుంట(హుజూరాబాద్‌): వచ్చే నెల మొదటి వారంలో ప్రజాపథం మాదిరిగా నూతన పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు శ్రీకారం చుడుతున్నట్లు ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గతంలో వైఎస్సార్‌ హయాంలో నిర్వహించిన ప్రజాపథంతో తనకు జనంలో ఎంతగానో పేరొచ్చిందని గుర్తు చేశారు. పట్టణంలోని ఎంపీఆర్‌ గార్డెన్‌లో సోమవారం నిర్వహించిన హూజూరాబాద్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లోని సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం ద్వారానే ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడుతాయని పేర్కొన్నారు.

గత ప్రభుత్వాలు చిన్న పనులు చేసి గొప్పగా ప్రచారం చేసుకునేవని..టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్ప పనులు చేస్తున్నప్పటికీ కార్యకర్తలు తగురీతిలో ప్రచారం చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే నెలలో కార్యకర్తలు, నాయకలు గ్రామగ్రామాన పర్యటనలతో ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. జమ్మికుంట, హూజూరాబాద్, వీణవంక, కమాలాపూర్‌ మండలాలకు చెందిన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు, నగర పంచాయతీ చైర్మన్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్‌లు, వార్డుమెంబర్లు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సత్తా చాటుకోవాలి

వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు జనాన్ని వేలాదిగా తరలించి నియోజకవర్గ సత్తా చాటుకోవాలని మంత్రి ఈటల రాజేందర్‌ కార్యకర్తలు, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు సూచించారు. వరంగల్‌ సభకు నియోజకవర్గం నుంచి 50 వేల మందిని తరలించాలన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సులు, కార్లు, జీపుల్లో, పురుషులు ట్రాక్టర్లు, డీసీఎం, లారీలు, ఆటోల్లో తరలిరావాలని కోరారు. ఎర్రగుట్ట వద్ద జనాన్ని కలుస్తానన్నారు. అనంతరం గ్రామాలవారీగా ఎవరెవరు ఎలా జనాన్ని తరలిస్తారు?ఎంతమందిని తీసుకొస్తారనేది తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ట్రాక్టర్లలో ర్యాలీగా తరలిరావాలన్నారు.   

మరిన్ని వార్తలు