పాపాలాల్ కే పీఠం!

12 Mar, 2016 03:15 IST|Sakshi
పాపాలాల్ కే పీఠం!

మేయర్‌గా దాదాపు ఖాయం 
‘డిప్యూటీ’పై అధికార పార్టీ తర్జనభర్జన
మేయర్‌గా దాదాపు ఖాయం
‘డిప్యూటీ’ కోసం కుల సమీకరణ లు
అన్ని పార్టీల్లో ఫ్లోర్‌లీడర్లపై చర్చ
15వ తేదీన ప్రమాణ స్వీకారం


ఖమ్మం: కార్పొరేషన్ మేయర్ పీఠం అప్పగించే విషయంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ముందునుంచి మేయర్ అభ్యర్థిగా చెబుతున్న డాక్టర్ పాపాలాల్‌కే పట్టం కట్టాలని ఆ పార్టీ అధినాయకత్వం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు డిప్యూటీ మేయర్‌పై ప్రధాన చర్చ సాగుతోంది. మేయర్ స్థానం ఎస్టీలకు రిజర్వు అయింది. కాబట్టి డిప్యూటీ మేయర్ జనరల్ కేటగిరీ అభ్యర్థికి ఇవ్వాలనే వాదన వినిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గానికే కేటాయించాలని ఓ వర్గం నాయకులు పట్టుబడుతున్నారు. బీసీలకు ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. 50 డివిజన్లలో 34 స్థానాలు దక్కించుకున్న టీఆర్‌ఎస్ నుంచి దాదాపు పది మంది డిప్యూటీ మేయర్ పదవిని ఆశిస్తుండటం గమనార్హం.

 ఆ ఆరుగురిలో ఎవరు?
డిప్యూటీ మేయర్ పదవిని ఆశిస్తున్న వారిలో పార్టీ ఖమ్మం నగర అధ్యక్ష, కార్యదర్శులు కమర్తపు మురళి, చావా నారాయణరావుతోపాటు పోట్ల శశికళ, కొత్తపల్లి నీరజ, శీలంశెట్టి రమ, ప్రశాంతలక్ష్మి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పురుషులకు కేటాయిస్తే చావా నారాయణరావు లేదా కమర్తపు మురళీలలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మేయర్ పురుషుడు కావడంతో డిప్యూటీ మేయర్‌ను మహిళలకు కేటాయిస్తే వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని పార్టీలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఒకవేళ ఇదే జరిగితే పోట్ల శశికళ లేదా నీరజతో పాటు శీలంశెట్టి రమలలో ఒకరికి ఇస్తే బాగుంటుందని పార్టీలోని కొందరు నాయకులు సూచనప్రాయంగా తెలిపినట్లు సమాచారం. మేయర్‌ను ఎంపిక చేయడం కంటే డిప్యూటీ  నియామకం ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంపై ఆ పార్టీ నాయకులతో కూడా ఒకమారు చర్చించినట్లు సమాచారం.

 ఫ్లోర్‌లీడర్ల నియామకంలో విపక్షాలు..
ఈనెల 15న కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం, ప్రమాణ స్వీకారం, ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్ల ని యామకం జరుగుతుండటంతో ప్రతిపక్షాలు తమ పక్షం తరఫున ఫ్లోర్‌లీడర్‌గా ఎవరిని నియమించాలనే దానిపై కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది కార్పొరేటర్లు గెలుపొందారు. వీరిలో వడ్డెబోయిన నరసింహారావు, నాగండ్ల దీపక్‌చౌదరి, యర్రం బాలగంగాధర్ తిలక్, పాలడు గు పాపారావులతోపాటు ఆరుగురు మహిళలున్నారు. గతంలో కౌన్సిల్‌లో పనిచేసిన అనుభవం ఉన్న వడ్డెబోయిన నరసింహారావు, బాలగంగాధర్‌తిలక్‌లలో ఒకరికి ఫ్లోర్‌లీడర్ పదవి అప్పగించే ప్రయత్నంలో ఆ పార్టీ ఉంది.

ఫ్లోర్‌లీడర్ పదవి త నకూ కావాలని దీపక్‌చౌదరి తన అనుచరుల ద్వా రా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కోరినట్లు తెలిసింది. సీపీఐ నుంచి క్లెమెంట్, సక్కుబాయిలు గెలుపొందగా.. క్లెమెంట్‌కే ఫ్లోర్‌లీడర్ బాధ్యతలు అప్పగించనున్నారు. సీపీఎం నుంచి గెలుపొందిన వారిలో అఫ్రోజ్ సమీనా, యర్రా శైలజలు ఇద్దరూ మహిళలే కావడంతో గతంలో చైర్‌పర్సన్‌గా పనిచేసిన సమీనాకు ఇవ్వాలా.. లేదా శైలజకు ఇవ్వాలా..? అనే విషయాన్ని పార్టీ పరిశీలిస్తోంది. వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన దోరేపల్లి శ్వేత, సలువాది వెంకయ్యల్లో ఒకరిని ఎంపిక చేస్తామని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు