నోట్ల రద్దు వెనుక వాస్తవాలపై విశ్లేషణ అవసరం

17 Dec, 2016 02:29 IST|Sakshi
భీమవరం టౌన్‌: ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్యపరమైన హీనతతో బాధపడుతోందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ వ్యాఖ్యానించారు. నగదు రహిత ఆర్థికవ్యవస్థ చెడ్డదని, ఉపయోగం లేనిదని తాను చెప్పనని అయితే దానికి ముందుగా ఆర్థికవ్యవస్థ స్వరూపం మార్చాలని స్పష్టం చేశారు. భీమవరం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ‘పెద్దనోట్ల రద్దు.. ప్రజ లపై ప్రభావం’ అనే అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ముఖ్యవక్తగా హాజరైన నాగేశ్వర్‌ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు దాని వెనుక ఉన్న వాస్తవాలపై ఆర్థిక విశ్లేషణ అవసరమన్నారు. పెద్దనోట్ల రద్దు సాహసం ప్రపంచంలో ఎవరూ ఇంతవరకూ చేయలేదు.. ప్రధాని మోదీ మాత్రమే చేశారంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని నాగేశ్వర్‌ చెప్పారు. ఐరోపా దేశాల ఆర్థికకూటమి పెద్దనోట్లను గతంలో రద్దు చేసిందన్నారు. భారత్‌లో పెద్ద నోట్ల రద్దు ఇదే మొదటిసారి కాదన్నారు. సామాన్యులు కూడా రూ.500 నోట్లు సంపాదిస్తున్నారని ఈ నోటు విలాసవస్తువో, సంపన్నులకు మాత్రమే పరిమితం కాదన్నారు. ప్రధాని మోదీ నగదురహిత ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని చెప్పి 40 రోజులు తిరగకుండానే కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ మాటమార్చారన్నారు.   నల్లధనం రూ.500, రూ.1,000 నోట్లు అయితే బొగ్గు, స్పెక్టమ్ర్, కామన్‌వెల్త్, పశుగ్రాసం, బోఫోర్స్, కేజీ బేసిన్, హర్షద్‌ మెహతా  తదితర కుంభకోణాల్లో ఎన్ని లక్షల కోట్లు ఆ కుంభకోణాలకు పాల్పడిన వారి ఇళ్లల్లో దొరికాయని నాగేశ్వరరావు ప్రశ్నించారు. నగదు రహిత విధాన కమిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కన్వీనర్‌గా ఉన్నారని హ్యాక్‌ జరిగితే నెలకొనే ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారో ఆయన చెప్పాలన్నారు. దేశంలో ఒక కోటి యాభై లక్షలు చిన్నదుకాణాలు ఉన్నాయని, స్వైపింగ్‌ మెషిన్లు 14 లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. 90 శాతం రోడ్డు పక్క వ్యాపారాలు చేసేవారే ఉన్నారన్నారు. ఒక్కోటి 50 లక్షల దుకాణాలకు స్వైపింగ్‌ మెషిన్లు ఎప్పుడిస్తారు? ఈలోపు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సదస్సుకు యూటీఎఫ్‌ అధ్యక్షుడు పి.జయకర్‌ అధ్యక్షత వహించారు. వివిధ సంఘాల నాయకులు గాతల జేమ్స్, చింతకాయల బాబూరావు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు