‘ఆశాజ్యోతి’ సేవలు అభినందనీయం

20 Jul, 2016 21:23 IST|Sakshi
కలెక్టర్‌కు స్వాగతం పలుకుతున్న చిన్నారులు

కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌
గజ్వేల్‌ రూరల్‌: స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడడం అభినందనీయమని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ  మంచి పౌరులుగా ఎదగాలని కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ అన్నారు. బుధవారం నగర పంచాయతీ పరిధిలోని ‘ఆశాజ్యోతి’ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ‘ఆశాజ్యోతి’ ఆవరణలో మొక్క నాటారు. ఆశాజ్యోతిలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్, ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు, నగర పంచాయతీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్, ఆశాజ్యోతి సంస్థ ఫాదర్‌ ఆల్విన్‌ జ్యోతి వెలిగించి  కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రోనాల్డ్‌రోస్‌ మాట్లాడుతూ ఆశాజ్యోతిలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులను 24గంటల పాటు కంటికి రెప్పలా కాపాడడం అభినందనీయమన్నారు. ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు తనకు ఉత్తమ అధికారిగా వచ్చిన రూ. లక్షను అనాథ చిన్నారుల సంక్షేమానికి అందించడంతో పాటు ప్రభుత్వ అధికారులు కాశీనాథం, జగన్నాథరెడ్డితో పాటు ఇతర అధికారులు, దాతలు సైతం భాగస్వాములవడం సంతోషంగా ఉందన్నారు.

ఫాదర్‌ ఆల్విన్‌ మాట్లాడుతూ పదేళ్ల నుంచి ‘ఆశాజ్యోతి’ అందిస్తున్న వైద్య చికిత్సలు, సేవలను వివరించారు. నగర పంచాయతీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌ మాట్లాడుతూ ‘ఆశాజ్యోతి’లో ఆశ్రయం పొందుతున్న  చిన్నారులు సీఎం కేసీఆర్‌ను కలవాలనే కోరికను తీర్చేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు.

ఈ సందర్భంగా ‘వరల్డ్‌ విజన్‌’, పలువురు దాతలు అందించిన పౌష్టికాహారం, మందులను కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ ఆశాజ్యోతిలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు, టీబీ వ్యాధిగ్రస్తులకు అందజేశారు. అంతకుముందు ‘ఆశాజ్యోతి’ సావనీర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎస్‌వీడీ ఫాదర్‌ ఆంటోని జోసె ఫ్, జీవోదయ డైరెక్టర్‌ ఫాదర్‌ ఫెలిక్స్‌రోచ్, నగర పంచాయతీ వైస్‌చైర్మన్‌ దుంబాల అరుణ, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంధ సంస్థల సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు