-

కస్సు‘బస్సు’!

27 Aug, 2016 22:06 IST|Sakshi
కస్సు‘బస్సు’!
  • సమీప బస్టాప్‌ల మధ్య ప్రయాణానికి నో ఎంట్రీ
  • ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కండక్టర్ల నిర్వాకం
  • పైగా అవమానిస్తూ.. దింపేస్తూ..
  • ఇష్టారాజ్యంగా సిబ్బంది తీరు
  • కండక్టర్ల తీరు చట్టవిరుద్ధమన్న ఆర్‌ఎం
  • కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంస్థను లాభాల బాట పట్టించేందుకు.. ‘చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపుతాం.. ప్రయాణికులు కోరిన చోట దింపుతాం’.. అనే నినాదాన్ని ఎత్తుకుంది ఆర్టీసీ. కానీ కొందరు కండక్టర్ల తీరు అందుకు భిన్నంగా ఉంది. తక్కువ దూరం ప్రయాణించే వారిని ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అనుమతించడం లేదు. పైగా గొడవపడుతున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. అవమానిస్తూ మధ్యలోనే బలవంతంగా దింపేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చంటిపిల్లలు ఉన్నారనే కనీస గౌరవం కూడా లేకుండా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ అద్దె బస్సుల్లో ఇలాంటి పరిస్థితి కన్పిస్తుంది.

    హైదరాబాద్‌ నుంచి బీదర్‌ వయా జహీరాబాద్‌ మార్గంలో ఆర్టీసీ బస్సుల్లో రోజుకు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. సంగారెడ్డి వరకు హైదరాబాద్‌ సిటీతో కలిసి ఉండటంతో ఇక్కడి ఉద్యోగులు, వ్యాపారులు నిత్యం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుంటారు. సిటీ నుంచి జిల్లా ప్రవేశంలోని రామచంద్రాపురం, పటాన్‌చెరు, సంగారెడ్డి సదాశివపేట, బుదేరా చౌరస్తా, కోహిర్‌ చౌరస్తా, జహీరాబాద్‌ తదితర చోట్ల ఎక్స్‌ప్రెస్‌ బస్‌ స్టాప్‌లు ఉన్నాయి.

    నిబంధనల ప్రకారమైతే ప్రయాణికులు పై బస్టాండ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. కానీ కండక్టర్లు ఆ నిబంధనలు పాటించడం లేదు.  హైదరాబాద్‌ నుంచి రామచంద్రాపురం, పటాన్‌చెరు, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో దిగాలి అనుకునే వారిని బస్సుల్లో ఎక్కించుకోవడం లేదు. తెలియక బస్సు ఎక్కిన వారిని బలవంతంగా దింపేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారి పట్ల మొరటుగా ప్రవర్తిస్తున్నారు.

    సిటీ బస్సుల్లో రావాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇటీవల ఇద్దరు పసి పిల్లలతో ఓ కుటుంబం ఎంజీబీఎస్‌లో జహీరాబాద్‌ డిపో బస్సు ఎక్కారు. బీహెచ్‌ఈఎల్‌  టికెట్‌ అడిగారు. సాధారణంగా కండక్టర్లు నాంపల్లి, లక్డీకాపూల్‌ ప్రాంతాలకు చేరుకున్న తరువాత టికెట్‌ ఇవ్వడం మొదలు పెడతారు. బీహెచ్‌ఈఎల్‌ వరకు టికెట్‌ అడిగిన కుటుంబానికి కండక్టర్‌ టికెట్‌ ఇవ్వడానికి నిరాకరించారు. దాదాపు కిలో మీటర్‌ దూరానికిపైగా వారితో గొడవపడి చివరకు ఖైరతాబాద్‌ చౌరస్తాలో బలవంతంగా దింపేశారు.

    తాజాగా శనివారం జహీరాబాద్‌కు డిపోకే చెందిన 1931 సరీస్‌ నంబర్‌ బస్సులో రఘురామయ్య అనే సీనియర్‌ సిటిజన్‌ ఎక్కాడు. బీహెచ్‌ఈఎల్‌ వరకు టికెట్‌ అడగ్గా కండక్టర్‌ నిరాకరించి, ఆయనతో గొడవకు దిగారు. వెనుక సిటీ బస్సులో రావాలంటూ ఆయన్ను ముందుకు తోసేందుకు ప్రయత్నించాడని బాధితుడు ‘సాక్షి’తో వాపోయారు.

    తాను సీనియర్‌ సిటిజన్‌ అని రఘురామయ్య చెప్పే ప్రయత్నం చేయగా..  వెటకారంగా మాట్లాడి మధ్యలోనే దింపేసినట్టు బాధితుడు పేర్కొన్నారు. ఇక జహీరాబాద్‌ నుంచి కోహిర్‌ చౌరస్తా, బుదేరా వరకు ప్రయాణించాలనుకున్న ప్రయాణికులకు కూడా ఇదే చేదు అనుభవం ఎదురవుతోంది. పల్లె వెలుగు బస్సుల్లో రావాలంటూ వారికి ఉచిత సలహాలిస్తున్నట్టు పలువురు బాధిత ప్రయాణికులు చెబుతున్నారు.

    సొంత నిర్ణయాలొద్దు..
    ఆర్టీసీ కండక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణికులు ఎక్కడైనా ఎక్కుతారు. ఇష్టం వచ్చిన చోట దిగుతారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించి, దగ్గరి స్టాప్‌లో దిగాలనుకునే వారిని ఎక్కించుకోవద్దనే నిబంధనలు ఏమీ లేవు. కండక్టర్లు సొంత నిర్ణయాలు తీసుకొని బలవంతంగా దింపేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం. ఎక్కడ ఆపినా ఎక్కించుకొని, కోరిన చోట దింపాలనేది ఆర్టీసీ పాలసీ. - టి.రఘునాథ్‌రావు, ఆర్‌ఎం, టీఎస్‌ ఆర్టీసీ మెదక్‌

మరిన్ని వార్తలు