తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

12 Jul, 2016 09:01 IST|Sakshi

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల 16న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఉగాది,ఆణఙవార ఆస్థానం, బ్రహ్మోత్సవం,  వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో వైదికమైన ఈ కార్యక్రమం నిర్వహించడం సంప్రదాయం. 

పసుపు, చందనం, కుంకుమ, తిరునామం,  పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ప్రత్యేక లేపనంతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేశారు. శుద్ధి కార్యక్రమం నిర్వహించిన అనంతరం దర్శనానికి అనుమతిస్తారు. దీంతో ఉదయం నిర్వహించాల్సిన  అష్టదశ పాద పద్మారాధన సేవను రద్దు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో కొత్త పరదాలు అలంకరించనున్నారు. తిరుపతికి చెందిన మేకల సుబ్రమణ్యం ఐదు పరదాలను స్వామివారికి సమర్పించారు.

మరిన్ని వార్తలు