'హరీష్ రావు వ్యాఖ్యల్లో నిజం లేదు'

2 May, 2016 17:58 IST|Sakshi

విజయవాడ: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఉన్నాయని, ఉమ్మడి రాష్ట్రంలోనే వీటికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారన్న హరీష్ రావు వ్యాఖ్యల్లో నిజంలేదన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు- రంగారెడ్డికి సంబంధించి 2013లో జీవో 72ను జారీ చేసిన విషయం వాస్తవమే అని, అయితే ఇది కేవలం సర్వే కోసం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా 2007లో జారీ చేసిన జీవో కేవలం సర్వే కోసమే అని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోలకు, పాత జీవోలకు అసలు పోతన లేదని తులసి రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు పూర్తిగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించినవి అని ఆయన పేర్కొన్నారు.

కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర జలవనరుల సంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు కావాలన్నారు. ఒకవేళ ఆ అనుమలు ఉంటే చూపించాలని హరీష్ రావుకు ఈ సందర్భంగా తులసి రెడ్డి సవాల్ విసిరారు. విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టుల వల్ల నిర్మితమై ఉన్న, నిర్మాణంలో ఉన్న పాత ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడరాదని, అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్లోని 8 జిల్లాల్లో 8 ప్రాజెక్టుల క్రింద 48 లక్షల ఆయకట్టుపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణాలు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.

ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తోంటే.. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వం చచ్చిన పాములా ఉలుకూ పలుకూ లేకుండా పడివుండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమన్నారు.
 

మరిన్ని వార్తలు