నూతనం..భిన్నం

18 Jun, 2016 03:54 IST|Sakshi
నూతనం..భిన్నం

ఖమ్మం జెడ్పీసెంటర్: ప్రజా ప్రతినిధుల అభిప్రాయాల సేకరణ సమావేశంలో రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..గ్రామాల విలీనం, కొత్త ప్రతిపాదనలను రేపటిలోగా కలెక్టర్‌కు సమర్పించాలని సూచించారు. పునర్విభజనకు జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ లోకే ష్‌కుమార్ వివరించారు. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్‌ను నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించిందని, కొత్త జిల్లాకు అవసరమైన తాత్కాలిక, శాశ్వత వసతి సౌకర్యం, సిబ్బంది కేటాయింపు విషయాలపై నివేదికలు సిద్ధం చేస్తామని చెప్పారు.

ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నట్లు తెలిపారు. పినపాక మండలాన్ని రెండుగా పినపాక, కరకగూడెం, పాల్వంచ మండలంలో పాల్వంచ అర్బన్, రూరల్, గుండాల మండలాన్ని గుండాల, ఆళ్లపల్లి, కొత్తగూడెం మండలాన్ని కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మూడు మండలాలుగా విభజించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేశారని, ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ప్రజా ప్రతినిధులు ఏమన్నారంటే..

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జేసీ దివ్య, పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, మేయర్ పాపాలాల్, సీఈఓ నాగేశ్, డీఆర్వో శ్రీనివాస్, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు.

ఇల్లెందు మ్మెల్యే కోరం కనకయ్య: ఇల్లెందు నియోజకవర్గాన్ని గతంలో మాదిరిగానే ఖమ్మం జిల్లాలోనే ఉంచాలి. సత్యనారాయణ పురం గ్రామాన్ని బయ్యారం మండలంలో విలీనం చేయాలి.

ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్: కై కొండాయిగూడెం, రామన్నపేట, దానవాయిగూడెంను ఖమ్మం అర్బన్ మండలంలో, దారేడు, కామంచికల్, మల్లెమడుగును, రఘనాథపాలెం మండలంలో విలీనం చేయాలి. ఖమ్మం అర్బన్ మండలానికి ఒకే తహసీల్దార్ ఉన్నందున  ప్రత్యేక అర్బన్ మండలాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య: దుమ్ముగూడెం మండలంలోని కొన్ని గ్రామాలు చర్ల మండలానికి సమీపంలో ఉన్నందున వాటిని అక్కడ విలీనం చేయాలి.

 ఎస్సీ కార్పొరే షన్ చైర్మన్ పిడమర్తి రవి: గార్ల మండలాన్ని ఖమ్మం జిల్లాలోనే ఉంచాలి.

ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ: చర్ల, దుమ్ముగూడెం గ్రామాలతో పర్ణశాల మండలాన్ని ఏర్పాటు చేయాలి.

కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్: కొత్తగూడెం మండలాన్ని  మూడు మండలాలుగా విభజించాలి. కొత్తగూడెంలో కొన్ని గ్రామాలు సుదూరంగా ఉన్నందున ప్రజల సౌకర్యార్థం కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లిలను మండలాలుగా చేయాలి.

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు: పినపాకను ఆళ్లపల్లి, కరకగూడెం మండలాలుగా విభజించాలి.

అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు: చండ్రుగొండ మండలాన్ని అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాలు విభజించాలి.

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి: నూతన జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషదాయకం. జిల్లా పునర్విభజన వల్ల పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు ఏమీ మారడం లేదు. ప్రస్తుతం మండల కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామ పంచాయతీలను దగ్గర మండల కేంద్రాల్లో విలీనం చేయాలి.

కలెక్టర్ లోకేష్ కుమార్: మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలను దగ్గర మండలాల్లో విలీనం చేయాలి. గ్రామ పంచాయతీ తీర్మానం చేసి నివేదికలు ఇవ్వాలి.  గార్ల మండలంలోని ఎస్సీలు అధికంగా నివసించే గ్రామాలను బయ్యారం మండలంలో విలీనం చేస్తాం.

వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్: సింగరేణి మండలాన్ని ఖమ్మం జిల్లాలో ఉంచాలి. కొత్తగూడేనికి దూరంగా ఉండడంతో మార్పు చేయొద్దు.

‘కొత్త’ గ్రామాలు, మండలాల విలీనంపై ప్రజా ప్రతినిధుల అభ్యంతరాలు
జిల్లా పునర్విభజన విషయంలో కొన్ని గ్రామాలు, మండలాల విషయంలో ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొత్త మార్పులు వద్దని కొందరంటే.. చేర్చుకోవాల్సిన గ్రామాలను మరికొందరు ప్రస్తావిస్తూ..ఎమ్మెల్యేలు తమ డిమాండ్లను బహిర్గతం చేశారు. శుక్రవారం టీటీడీసీ భవన్‌లో పునర్విభజనపై జిల్లా ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆసక్తికర చర్చ జరిగింది.

మరిన్ని వార్తలు