రూ.15 కోట్లు...కృష్ణార్పణం

2 Nov, 2016 00:11 IST|Sakshi
రూ.15 కోట్లు...కృష్ణార్పణం
సాక్షిప్రతినిధి, కాకినాడ : ప్రజల సొమ్మే కాదు ప్రజలు ఏమైపోయినా సరే పాలకులకు లెక్కేలేకుండా పోతోంది. పాతికవేల మందిని ఇబ్బందుల పాలుజేసి ‘తమ్ముడుంగారి’ బాగు కోసం పురపాలికలు మోకరిల్లుతుండడంతో పట్టణ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇందుకు ఉదాహరణ తుని నడిబొడ్డున బాతులు కోనేరును బినామీ పేర్లతో ఆక్రమించేసిన వైనమే. 15 వార్డుల్లో నివసించే పాతికవేల మంది ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆక్రమణలు చేస్తున్నా అడ్డుకోవల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించడమేమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 53 సెంట్లు జిరాయితీ స్థలాన్ని కొనుగోలుచేసి కోట్ల రూపాయల విలువైన కోనేరు స్థలాన్ని కలిపేసుకున్నారు. మున్సిపాలిటీగా ఏర్పాటుకాక మునుపు తుని వీరవరం పంచాయతీగా ఉండేది. మురుగు ఈ బాతుల కోనేరులోకి వచ్చి ముంపు నుంచి రక్షించేది. కోనేరును చదును చేసి స్థలంగా మార్చేయడంతో పాతికవేల మంది నివసిస్తున్న 15 వార్డులు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆక్రమణకు గురైన ఈ కోనేరును తిరిగి స్వాధీనం చేసుకునే ధైర్యం ఎవరికీ లేదు. ఏదైనా తేడా వచ్చినా ‘అన్నయ్య’ (తుని నియోజక వర్గంలో అధికార పార్టీ ముఖ్య ప్రజా ప్రతినిధి) చూసుకుంటారని తమ్ముడు ఇచ్చిన ధైర్యంతో పురపాలికలు కిమ్మనడం లేదు. ఆక్రమణదారులను వదిలేసిన మున్సిపాలిటీ ప్రత్యామ్నాయంగా రూ.38 లక్షల ప్రజధనాన్ని కుమ్మరించి కొత్తగా  డ్రై¯ŒSను నిర్మించింది. గట్టిగా వర్షం పడితే చాలు లక్షలు పోసి నిర్మించిన ఈ డ్రై¯ŒS ఎందుకు పనికిరావడం లేదు. వచ్చిన వర్షం నీటిని అదుపు చేయలేకపోవడంతో వరద కష్టాలు తప్పడం లేదు.
ఆక్రమణ విలువ రూ.15 కోట్ల పైమాటే...
ఆక్రమించుకున్న ఆ స్థలం మార్కెట్‌ విలువ రూ.15 కోట్ల పైమాటే. అన్ని కోట్లు విలువైన బాతుల కోనేరు కబ్జా చేసినా అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. కోనేరుకు ముందు జీఎన్టీటీ రోడ్డును అనుకుని తాలూకా పోలీస్‌స్టేçÙన్, దానికి వెనుక పోలీస్‌ క్వార్టర్లున్నాయి. ఇవన్నీ పోరంబోకు భూమిలో ఏర్పాటు చేసినవే. వీరవరం పంచాయతీగా ఉండగా సర్వే నంబరు 268/4లో 1.50 ఎకరాల రెవెన్యూ పోరంబోకు ఇది. 1983లో పురపాలక సంఘం జీఎన్టీ రోడ్డులోని సర్వే నంబరు 268/4లో సోమరాజు సినిమా థియేటర్‌ గోడ అనుకుని 22 సెంట్లు భూమిలో మురుగు కాలువ నిర్మించింది. కాలువ 15 వార్డుల మురుగుకు నీరు పారుదలకు ప్రధాన మార్గం.
బినామీ పేర్లతో కొనుగోలు...
బాతులు కోనేరు మనుగడలో ఉండగా ఆ స్థలంలో ఎవరూ లేరని స్థానికులు ఎవరినడిగినా ఇట్టే చెబుతారు. తునికి చెందిన ఒక వ్యక్తి సర్వే నంబరు 268/4 లో 1.25 సెంట్లు భూమి కొన్నట్టు డాక్యుమెంట్లు అధికారులకు అందజేశాడు.1995లో రెవెన్యూ సర్వేలో ప్రభుత్వ భూమిగా నిర్థారించారు. దీనిపై 2003లో జేసీ కోర్టును పిటీషనర్‌ ఆశ్రయించగా, జేసీ ఆదేశాల మేరకు మున్సిపల్‌ కాలువకు 22 సెంట్లు భూమి విడిచిపెట్టేశారు. జేసీ కోర్టుకు వెళ్లిన వ్యక్తికి తన పేరుతో 53 సెంట్లు 2005లో పట్టా ఇచ్చారు. వెబ్‌ ల్యాండ్‌లో మాత్రం ఆ భూమి రెవెన్యూ పోరంబోకుగానే ఉంది. అయినా సరే తన అధికార దర్పాన్ని చూపించి కబ్జాకు పాల్పడ్డాడు. 
కొనుగోలు ఇంత ... ఆక్రమణ అంత...
అధికారికంగా కొనుగోలు చేసింది 53 సెంట్లే. కానీ ఆ భూమికి ఆనుకుని మురుగు డ్రై¯ŒSకు చెందిన 22 సెంట్లు, పోలీస్‌ క్వార్టర్స్‌ సమీపాన 10 సెంట్లనూ తన ఖాతాలో వేసేసుకున్నాడు.ఈ మొత్తం భూమి 1500 గజాలు పైబడి  ఉంది. అక్కడ గజం రూ.లక్ష పలుకుతుంది.అంటే అక్షరాలా రూ.15 కోట్లు విలువైన స్థలం అధికారాన్ని అడ్డంపెట్టుకుని బినామీ పేర్లతో తమ్ముడు చేతుల్లోకి పోయింది. మున్సిపల్‌ కాలువ ఆనుకుని ఉన్న థియేటర్‌ను కూడా తమ్ముడు బినామీలే కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ఆ స్థలం, కబ్జా చేసిన స్థలాన్ని చదును చేసేసి కంచె ఏర్పాటు చేశారు. ప్లాట్‌లుగా అమ్మకానికి పెట్టినా భూమి రికార్డు విషయం తెలుసుకున్న వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. కాలువ మూసి వేసినా పురపాలకులు మాత్రం తమ్ముడు అడుగులకు మడుగులొత్తుతూనే ఉన్నారు.
మరిన్ని వార్తలు