తూప్రాన్‌ను రెవెన్యూ డివిజన్‌గానే ఉంచాలి

31 Aug, 2016 21:13 IST|Sakshi

తూప్రాన్‌: ప్రభుత్వం ప్రకటించినట్లుగానే తూప్రాన్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఉంచాలని యాదవ సంఘం జిల్లా యూత్‌ అధ్యక్షుడు అబోతు వెంకటేశ్‌యాదవ్‌ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తూప్రాన్‌ మండలంను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంపట్ల ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

కాని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి మాత్రం తూప్రాన్‌ బదులుగా నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలన్నారు. అభివృద్ధిలో ముందంజలో ఉండి హైదరాబాద్‌ నగరానికి సమీప దూరంలో ఉన్న తూప్రాన్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయడం పట్ల ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే మండలంలో పోలీస్‌ సబ్‌డివిజన్‌, విద్యుత్‌ సబ్‌ సబ్‌డివిజన్‌లు ఉన్నాయని చెప్పారు.

చాల ఏళ్ల కాలం నుంచి మండల ప్రజలు రెవెన్యూ డివిజన్‌ కోసం కృషి చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి మండల ప్రజల గోడును విని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడం పట్ల సర్వత్ర అభినందనలు తెలియజేశారన్నారు. కాని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి తమ మండల అభివృద్ధిని గుర్తించి సహకరించాల్సింది పోయి నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తించడం సమంజసం కాదన్నారు. సమావేశంలో గొర్ల కాపారుల సంఘం జిల్లా డైరక్టర్‌ గండి మల్లేష్‌ యాదవ్‌, యూత్‌ నాయకులు రాజుయాదవ్‌, మల్లేష్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు