రూ.75 లక్షలకు టోకరా?

21 Mar, 2017 02:35 IST|Sakshi
రూ.75 లక్షలకు టోకరా?

నిజామాబాద్‌ మార్కెట్‌లో పసుపు వ్యాపారి పరారీ  
లబోదిబోమంటున్న కమీషన్‌ ఏజెంట్లు, రైతులు


నిజామాబాద్‌ : నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీలో పసుపు కొనుగోలుదారుడు సుమారు రూ.75 లక్షలకు టోకరా వేశాడు. యార్డులో పసుపు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ఉడాయించినట్లు కమీషన్‌ ఏజెంట్లు, కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు.  వారం రోజులుగా ఈ వ్యాపారి ఆచూకీ లభించకపోవడంతో సోమవారం వెలుగులోకి వచ్చింది. పసుపు కొనుగోలు చేసి, డబ్బులు చెల్లించకుండా ఉడాయించడంతో కమీషన్‌ ఏజెంట్లు, రైతులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై బాధిత ఏజెంట్లు, కొందరు రైతులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఈ వ్యాపారి నాలుగైదేళ్లుగా పసుపు కొనుగోలు చేస్తున్నాడు. ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా పసుపు కొనుగోళ్లు జరిపాడు. ఈ సీజన్‌ ప్రారంభం నుంచి కొనుగోలు చేసిన పసుపునకు డబ్బులు చెల్లిస్తూ వచ్చిన ఆయన, వారం రోజుల నుంచి కొనుగోలు చేసిన పసుపునకు డబ్బుల చెల్లింపులు నిలిపివేశారు. శనివారం, ఆదివారం పసుపు కొనుగోళ్లు లేకపోవడంతో ఈ విషయం ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం ఉదయం నుంచి ఈ వ్యాపారి కమీషన్‌ ఏజెంట్లకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన ఇంటికి వెళ్లి ఆరా తీయగా, కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆ వ్యాపారి పరారైనట్లు కమీషన్‌ ఏజెంట్లు భావిస్తున్నారు.

బాధితుల్లో రైతులు
ఈ వ్యాపారి బాధితుల్లో కొందరు రైతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది కమీషన్‌ ఏజెంట్ల వద్ద పసుపు కొనుగోళ్లు చేసి, చేతులెత్తేనట్లు తెలిసింది. వీరంతా సోమవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరికి ఎంతెంత టోకరా వేసి వెళ్లాడని చర్చించుకున్నట్లు సమాచారం. మంగళవారం బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

గతంలో ఇలాంటి ఘటనలే..
నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు టోకరా పెట్టడం ఇది కొత్తేమీ కాదు. కానీ.. ఈ పదేళ్లలో ఈ తరహా ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. 2004కు ముందు సుమారు 10 మంది వరకు వ్యాపారులు ఇలా ఉడాయించారు. అనంతరం ఐపీఈతో నిజామాబాద్‌ నగరానికి వచ్చి దర్జాగా ఇతర వ్యాపారాలు చేసుకున్నారు. సుమారు పదేళ్ల అనంతరం ఇప్పుడు మళ్లీ మార్కెట్‌ యార్డులో వ్యాపారి టోకరా వెలుగులోకి రావడంతో వ్యాపార, వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యాపారి టోకరా వేయడంపై మార్కెటింగ్‌శాఖ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా