21: 18

18 Aug, 2016 23:37 IST|Sakshi
21: 18
  • ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు మండలాల విభజన
  •  సీఎం వద్దకు చేరిన ఫైనల్‌ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌
  •  కొత్త జిల్లాల తర్వాతే కొత్త మండలాలు
  • మహబూబాబాద్‌లోనే గార్ల, బయ్యారం
  • సాక్షిప్రతినిధి, ఖమ్మం : అఖిలపక్ష భేటీ,  డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త జిల్లాల విభజన పూర్తి చేసింది. సీఎం కేసీఆర్‌  వద్దకు ఫైనల్‌ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ వెళ్లింది. ఈ నోటిఫికేషన్‌లో ఖమ్మం జిల్లాలోకి 21 మండలాలు, కొత్తగూడెం జిల్లాలోకి 18 మండలాలు వస్తున్నాయి. గార్ల, బయ్యారం మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్తున్నాయి.
            జిల్లాల పునర్విభజనలో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం అందించిన నివేదికను సీఎం కేసీఆర్‌ పూర్తిగా విశ్లేషించిన అనంతరం ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల రూపురేఖలు ఖరారయ్యాయి. మంత్రివర్గ ఉపసంఘం ఈనెల 13న జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించింది. ఈ మేరకు ఖమ్మం జిల్లాలోకి 21 మండలాలు, కొత్తగూడెం జిల్లాలోకి 18 మండలాలను చేర్చుతూ ఫైనల్‌ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను మంత్రివర్గ ఉపసంఘం తయారు చేసింది. ఫైనల్‌ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌కు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.
    రెండు జిల్లాలకు ఓ స్వరూపం
    మండలాల విభజనతో రెండు జిల్లాలకు ఓ స్వరూపం వచ్చింది. జిల్లాలోని మొత్తం 41 మండలాలకు గాను రెండు మండలాలు గార్ల, బయ్యారం మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్లగా.. మిగిలిన 39 మండలాల్లో 21 ఖమ్మం జిల్లాలోకి, 18 కొత్తగూడెం జిల్లాలోకి వెళ్లనున్నాయి.
    – ఖమ్మం జిల్లాలోకి ఖమ్మం అర్బన్, బోనకల్, చింతకాని, మధిర, ముదిగొండ, ఎర్రుపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, ఏన్కూరు, జూలూరుపాడు, కొణిజర్ల, సింగరేణి, వైరా, కామేపల్లి మండలాలు రానున్నాయి.
    – కొత్తగూడెం జిల్లాలోకి  అశ్వారావుపేట, చండ్రుగొండ, దమ్మపేట, ములకలపల్లి, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు, కొత్తగూడెం, పాల్వంచ, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, మణుగూరు, పినపాక, టేకులపల్లి, ఇల్లెందు మండలాలు రానున్నాయి.
    – ఖమ్మం జిల్లా 14,35,034 మంది జనాభాతో.. 4,614 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది. కొత్తగూడెం జిల్లా 8,045 కిలోమీటర్ల వ్యాసార్థంతో 11,38,910 మంది జనాభాతో ఉంటుంంది.
    జిల్లాల తర్వాతే మండలాలు..
    జిల్లాలతోపాటు మండలాల సంఖ్యను కూడా పెంచాలని తొలుత భావించారు. ఈ మేరకు మండలాల సంఖ్యపై కూడా అధికారులు నివేదికలు తయారు చేశారు. ఇందులో భాగంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఐదు మండలాలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం కూడా నివేదికలో పేర్కొన్నది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మండలాలను జిల్లా విభజన తర్వాతనే చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా..కరకగూడెం, ఆళ్లపల్లి, కొత్తగూడెం రూరల్, పాల్వంచ రూరల్, ఖమ్మం నియోజకవర్గ పరిధిలో మరో మండలం రానుంది.
    ఇల్లెందు మూడుముక్కలు..
    జిల్లా పునర్విభజనతో ఇల్లెందు నియోజకవర్గం మూడు ముక్కలు కానుంది. గార్ల, బయ్యారం మండలాలు మహబూబాబాద్‌ జిల్లాలోకి వెళ్తుండగా.. కామేపల్లి మండలం ఖమ్మం జిల్లాలోకి.. ఇల్లెందు కొత్తగూడెం జిల్లాలోకి వెళ్తుంది. ఇల్లెందు నియోజకవర్గం మొత్తాన్ని ఒకే జిల్లాలో ఉంచాలని అక్కడి ఎమ్మెల్యే కోరం కనకయ్య, నియోజకవర్గ ప్రజలు కోరినప్పటికీ గార్ల, బయ్యారం మహబూబాబాద్‌కు దగ్గరలో ఉన్నాయనే కారణంతో ఈ రెండు మండలాలను మహబూబాబాద్‌లో కలుపుతున్నారు. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కూడా జిల్లా ప్రజాప్రతినిధులు ఈ రెండు మండలాలను అటు ఖమ్మంలో కాని, ఇటు కొత్తగూడెంలో కాని ఉంచాలని ముక్తకంఠంతో కోరినా డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో మాత్రం వీటిని మహబూబాబాద్‌లో కలపాలని నిర్ణయించినట్లు తెలిసింది.  
    + ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోకి వచ్చే మండలాలు, జనాభా, విస్తీర్ణం
     – జిల్లా: ఖమ్మం
     మండలాలు : 21
    జనాభా: 14,35,034
    విస్తీర్ణం: 4,614 కిలోమీటర్లు
    – జిల్లా: కొత్తగూడెం
    మండలాలు : 18
    జనాభా: 11,38,910
    విస్తీర్ణం: 8,045 కిలోమీటర్లు

మరిన్ని వార్తలు