విద్యార్థినుల 'మిస్టరీ' హత్య కేసు సీఐడీకి

25 Feb, 2016 00:40 IST|Sakshi
విద్యార్థినుల 'మిస్టరీ' హత్య కేసు సీఐడీకి

- డీఎస్పీ బాలు జాదవ్‌కు దర్యాప్తు బాధ్యతలు


నర్సంపేట:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఇంకా మిస్టరీగానే ఉండిపోయిన ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల హత్యకేసు దర్యాప్తు సీబీసీఐడీ విభాగానికి బదిలీ అయింది. రెండు నెలలు కావస్తున్నప్పటికీ నిందితులను వెదికిపట్టుకోవడంలో జిల్లా పోలీసులు విఫలం కావడంతో సీఐడీ దర్యాప్తు అనివార్యమైంది. చనిపోయిన బాలికల తల్లిదండ్రులు 20 రోజుల కిందట డీజీపీ అనురాగ్‌శర్మను కలసి దర్యాప్తును వేగవంతం చేయాలని వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతలను సీఐడీ డీఎస్పీ బాలుజాదవ్‌కు అప్పగించారు. రెండు రోజుల కిందటే ఉత్తర్వులు జారీ అయ్యాయని, మేడారం జాతర బందోబస్తులో ఉండడం వల్ల బాధ్యతలు తీసుకోలేకపోయానని, అతి త్వరలోనే కేసును టేకప్ చేస్తానని డీఎస్సీ జాదవ్ 'సాక్షి'కి తెలిపారు.

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లె గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోన్న భానోత్ భూమిక, భానోత్ ప్రియూంకలను గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా చంపి, పూడ్చిపెట్టిన ఉదంతం గత ఏడాది డిసెంబర్ 27న వెలుగులోకి వచ్చింది. చెన్నారావుపేట వుండలం ఖాదర్‌పేట గుట్ట వద్ద  కుళ్లిపోయిన స్థితిలో ఆ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులకు సవాల్‌గా నిలిచిన ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు