హత్యకేసులో ఇద్దరి అరెస్టు

8 Nov, 2016 21:05 IST|Sakshi
హత్యకేసులో ఇద్దరి అరెస్టు
పట్నంబజారు: డబ్బు కోసం వృద్ధురాలిని హత్యచేసి పరారైన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచారు. జిల్లా పోలీసు కార్యాయంలోని అర్బన్‌ సమావేశమందిరంలో మంగళవారం అడిషనల్‌ ఎస్పీ జె. భాస్కరరావు, ఈస్ట్‌ డీఎస్పీ జేవి సంతోష్‌  మీడియాకు వివరాలు వెల్లడించారు. పాతగుంటూరు పరిధిలోని వినోభానగర్‌లో సాతులూరి ఎలిజిబెత్‌ (65) అనే వృద్ధురాలు నివాసం ఉంటున్నారు.  ఆప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లు పఠాన్‌గౌస్‌బాషా, మహ్మద్‌బాషా  ఎలిజిబెత్‌ నివాసం వద్ద అప్పుడప్పుడు కూర్చుని మంచినీరు అడుగుతూ ఉండేవారు. ఈ క్రమంలో అక్టోబర్‌ 18వ తేదీన ఫూటుగా మద్యం సేవించిన ఇరువురూ వృద్ధురాలి నివాసం వద్దకు వెళ్ళారు. ఎలిజిబెత్‌ ఒంటరిగా ఉండటాన్ని గమనించారు. పెద్ద కర్రను వెంట తీసుకుని  లోపలకి వెళ్లి ఎలిజిబెత్‌ను ఇష్టానుసారంగా కొట్టడంతో అమె అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం బీరువాలోని రూ. 8,500, సెల్‌ఫోన్‌ను తీసుకుని అక్కడ నుంచి∙పరారయ్యారు.  స్థానికులు, మృతురాలి బంధువుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు విచారించి గౌస్‌భాషా, మహ్మద్‌భాషా నిందితులుగా గుర్తించారు.  సెల్‌సిగ్నల్‌ ఆధారంగా వారి ఆచూకీ కోసం ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో చిలకలూరిపేటరోడ్డులోని మిర్చియార్డు వద్ద ఇరువురినీ అదుపులోకి తీసుకుని విచారించగా  హత్య చేసి డబ్బు తీసుకుపోయినట్లు అంగీకరించారు.  కాగా, 2013 సంవత్సరంలో గౌస్‌బాషాపై ఇటువంటి  కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆటోలో ఒక వృద్ధుని ఎక్కించుకుని వెళ్ళి, అతడిని తీవ్రంగా గాయపరిచి బంగారం, నగదు దోచుకునిపోయాడు.   నిందితులను పటుకోవటంలో ప్రతిభ కనపరిచిన ఐటీకోర్‌ బాలాజి, పాతగుంటూరు పోలీసుస్టషన్‌ సిబ్బందిని అభినందించటంతో పాటు రివార్డులను అందజేశారు. సమావేశంలో పాతగుంటూరు పీఎస్‌ ఎస్‌హెచ్‌వో పి. బాలమురళీకృష్ణ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు