ఉద్యోగాల పేరుతో అరకోటి దోచేశారు

3 Dec, 2015 19:46 IST|Sakshi

తూర్పు గోదావరి జిల్లా: ఉద్యోగాలిప్పిస్తామని ఆశ చూపి.. ఫోర్జరీ సంతకాలతో ప్రముఖ సంస్థ పేరిట నకిలీ నియామకపు ఆర్డర్లు సృష్టించి.. 39 మంది నిరుద్యోగుల నుంచి రూ.49 లక్షలు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను.. వారికి సహకరించిన మరో ఇద్దరిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

అనపర్తి సీఐ శీలం రాంబాబు కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం రంగపునాయుడుపాలేనికి చెందిన కిలారి పవన్ కుమార్ 2009లో ఖమ్మం జిల్లాలో ఎంసీఏ చదివాడు. చదువు పూర్తై తరువాత హైదరాబాద్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేశాడు. ఆ సమయంలో తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన జామి వరలక్ష్మి పరిచయమైంది. ఆమెతో వివాహానికి పవన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో 2011లో ఆమెను వివాహం చేసుకుని పవన్ పందలపాక వచ్చేశాడు. కాకినాడలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో కంప్యూటర్ పాఠాలు చెప్పేందుకు రూ.6 వేలకు ఉద్యోగంలో చేరాడు. ఆ డబ్బు చాలకపోవడంతో భార్యను వదిలి కాకినాడలోని ఒక హాస్టల్‌లో చేరాడు.

అక్కడే తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన వికలాంగుడైన మల్లిపూడి చంద్రసురేష్‌తో పవన్‌కు పరిచయమైంది. చంద్రసురేష్ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు అక్కడ ఉండేవాడు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకునేందుకు నిరుద్యోగులకు వల విసిరి అడ్డంగా డబ్బులు సంపాదించాలని వారు నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలిలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను బుట్టలో వేసుకునేందుకు పథకం పన్నారు. ఇందులో భాగంగా పవన్ కుమార్ కారణంగానే తనకు బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం వచ్చిందని చంద్ర సురేష్ తన గ్రామంలో పలువురిని నమ్మించాడు. ఒక్కొక్కరినీ పవన్ కుమార్‌కు పరిచయం చేసేవాడు. ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద డబ్బులు వసూలు చేశారు.

వివిధ జిల్లాలకు చెందిన 39 మంది వారి వలలో చిక్కుకున్నారు. వారి నుంచి నిందితులు తమ బ్యాంకు ఖాతాలకు రూ.29 లక్షల మేర లావాదేవీలు జరిపారు. బ్యాంకు ద్వారా కాకుండా మరో రూ.20 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు ఇచ్చినవారి నుంచి ఉద్యోగాల కోసం ఒత్తిడి రావడంతో నిందితులు బీహెచ్‌ఈఎల్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ నియామకపు ఉత్తర్వులు సృష్టించారు. ఇలా 15 మందికి నకిలీ ఉత్తర్వులు ఇచ్చారు. ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో వెంటూరుకు చెందిన వాసంశెట్టి వెంకటరమణ గత ఆగస్టు 24న రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం పోలీసులు పవన్ కుమార్, చంద్రసురేష్, అతడి తల్లి సీతారామలక్ష్మి, తండ్రి సత్తిబాబులను అరెస్ట్ చేశారు. నిందితులసై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా