భైంసాలో ఇద్దరు బాలురు మృతి

24 Jul, 2016 23:57 IST|Sakshi
భైంసాలో ఇద్దరు బాలురు మృతి
  • విద్యార్థుల మృతితో భైంసాలో విషాదఛాయలు
  • భైంసా : రోజులాగే ఇద్దరు స్నేహితులు బడికి వెళ్లారు. శనివారం సాయంత్రం సెలవు కాగానే పుస్తకాల బ్యాగులు ఇంట్లో పడేశారు. ఆరుబయట ఆడుకున్నారు. అలా అలా ఊరు శివారులోకి వెళ్లారు. అయితే రాత్రయినా తిరిగిరాలేదు. ఇటు కుటుంబసభ్యుల్లో గాబరా మెుదలైంది. విషయాన్ని పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు తెలిపారు. గాలింపు ముమ్మరం చేశారు. చివరికి భైంసా పట్టణంలోని గోపాల్‌నగర్‌ సమీపంలో జనావాసాలకు ఆనుకుని ఉన్న నీటి గుంతలో స్నానానికి వెళ్లిన సయ్యద్‌ఇమ్రాన్‌(12), ముజమ్మిల్‌ ఖురేషి(9) మృతదేహాలుగా కనిపించారు. ఇక్కడి లోతైన గుంత ఇటీవలే వర్షానికి నిండింది. ఇప్పుడిలా ఇద్దరు చిన్నారులను బలిగొంది. ఈ ఘటన భైంసాలో విషాదం నింపింది.
    తరగతులు వేరైనా స్నేహితులుగా..
    భైంసా పట్టణంలోని ఓవైసీనగర్‌ ప్రాంతంలో సయ్యద్‌గఫార్‌ కుటుంబం నివసిస్తుంది. ఈయనకు ఐదుగురు సంతానం. నాలుగేళ్ల క్రితం సయ్యద్‌ గఫార్‌ మృతిచెందాడు. ఐదో సంతానమైన సయ్యద్‌ ఇమ్రాన్‌(12)ను తల్లి కుతిజాబేగం పట్టణంలోని యూపీఎస్‌ పాఠశాలలో ఐదో తరగతి చదివిస్తోంది. అతడు రోజూ బడికి వచ్చేవాడు. సోదరులంతా పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. పక్కనే కసాబ్‌గల్లిలో సర్వర్‌ఖురేషి కుటుంబం నివసిస్తుంది. సర్వర్‌ ఖురేషి కుమారుడు ముజమ్మిల్‌ఖురేషి(9) కూడా ఇదే పాఠశాలలో మూడో తరగతి చదివేవాడు. వీరిద్దరూ స్నేహంగా ఉండేవారు. తరగతులు వేరైనా ప్రతీరోజు బడి అయిపోగానే కలిసి ఆడుకునేవారు. అలా శనివారం సాయంత్రం బడికి సెలవు కాగానే పిల్లలిద్దరూ తిరిగొచ్చి.. ఇలా తిరిగిరాని లోకాకు వెళ్లిపోయారు. నీటి గుంతలో స్నానానికని వెళ్లి ప్రాణాలే కోల్పోయారు. పిల్లల మృతదేహాల వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. భైంసా ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. పట్టణ ఎస్సై మహేందర్‌ కేసు నమోదు చేసుకున్నారు.
మరిన్ని వార్తలు