రెండు బస్సులు ఢీ

1 Oct, 2016 04:24 IST|Sakshi
రెండు బస్సులు ఢీ

రెండు బస్సులు ఢీ

 కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సు(కుమార్ ట్రావెల్స్) ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. నిజామాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తున్న నిజామాబాద్-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, జగిత్యాల నుంచి ముంబై వెళ్తున్న కుమార్ ట్రావెల్స్ బస్సు పోలీస్‌స్టేషన్, పెట్రోల్ బంక్ మధ్య ఉన్న మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి.

కుమార్ ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి చొచ్చుకుపోగా, ఆర్టీసీ బస్సు రోడ్డుపైనే నిలిచిపోయింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు వెనక భాగం, ప్రైవేట్ బస్సు ముందు భాగం దెబ్బతిన్నాయి. రెండు బస్సులో కలిపి సుమారు 100 మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేవు.  ప్రమాదానికి కారణమైన కుమార్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వినయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రభాకర్ చెప్పారు.

లారీని ఢీకొట్టిన ప్రైవేటు ఓల్వో బస్సు
 సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్రం శివారులో 44 నంబరు జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో లారీని ఓ ప్రైవేటు ఓల్వో బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపునకు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయబోతూ లారీని తగులుతూ దూసుకుపోయింది. బస్సులో 40 మంది ప్రయాణిస్తుండగా, ఇందులో శ్రీ చైతన్య కాలేజీకి చెందిన విద్యార్థులు 15 మంది ఉన్నారు. బస్సు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు వెళ్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న మనోజ్‌కుమార్ అనే ప్రయాణికుడికి  తీవ్ర గాయాలయ్యాయి. సదాశివనగర్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు