రెండు రోజులు.. రూ.9కోట్లు

18 Apr, 2017 23:28 IST|Sakshi
రెండు రోజులు.. రూ.9కోట్లు

పోతూపోతూ.. మా పనులు చేయండి!
– కలెక్టర్‌కు అధికారపార్టీ నేతల ప్రతిపాదనలు
– ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మంజూరు ఇవ్వాలని వినతులు
– సంతకం చేస్తారా.. చేయరా అని అధికారుల్లో చర్చ
– బదిలీ ఉత్తర్వుల తర్వాత గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం తప్పంటున్న అధికారులు
– పనుల కోసం పర్సెంటేజీలు వసూలు చేస్తున్న అధికార పార్టీ నేతలు


అవును.. కలెక్టర్‌ బదిలీ చుట్టూ వ్యాపారం జరుగుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.9కోట్ల వ్యవహారం ఇది. ఆయనకు బదిలీ తప్పదనే చర్చ నేపథ్యంలో గత రెండు రోజుల్లో అధికార పార్టీ నేతలు ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. ప్రతిపాదనలు.. వినతులతో ఒత్తిళ్లకు తెగబడ్డారు. మరి.. అందుకు ఆయన తలొగ్గుతారా? నైతికతకు కట్టుబడతారా? వేచి చూడాల్సిందే.

సాక్షి ప్రతినిధి, కర్నూలు: పోతూ పోతూ తమ పనులు చేసి పోవాలంటూ జిల్లా కలెక్టర్‌గా ఉన్న విజయమోహన్‌పై అధికారపార్టీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీపీ) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా మంజూరు చేసే రూ.50 కోట్ల నిధుల్లో నుంచి తమకు పనులు ఇవ్వాలని భారీగా ప్రతిపాదనలు సమర్పిస్తున్నారు. వాస్తవానికి గత వారం రోజుల నుంచి జిల్లా కలెక్టర్‌గా ఉన్న విజయమోహన్‌ బదిలీ అవుతారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కేవలం గత రెండు రోజుల్లోనే భారీగా ప్రతిపాదనలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. బదిలీ ఉత్తర్వులు 17వ తేదీ అర్ధరాత్రి విడుదలయ్యాయి. అంటే 18వ తేదీ నుంచి నిబంధనల మేరకు కొత్తగా ఎలాంటి పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకపోవడం నైతికంగా సరైనదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇందుకు భిన్నంగా కలెక్టర్‌ చేత ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీపీ) కింద భారీగా పనులకు ఆమోదం తీసుకోవడం కోసం అధికార పార్టీ నేతలు ఎగబడ్డారు. కేవలం 17, 18 తేదీల్లో మాత్రమే రూ.9 కోట్లకు పైగా పనులకు ప్రతిపాదనలు సమర్పించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వచ్చిన ప్రతిపాదనలను ఆగమేఘాల మీద కన్వర్జెన్సీ కమిటీలో ఉన్న జెడ్పీ సీఈఓ, పీఆర్‌ ఎస్‌ఈ, డీపీఓలు ఆమోదం తెలపాలంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చినట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగా అధికారులు కూడా ఈ ప్రతిపాదనలను సీపీఓ ద్వారా కలెక్టర్‌కు పంపించేందుకు రంగం సిద్ధమయింది. ఈ నేపథ్యంలో బదిలీ ఉత్తర్వులు విడుదలైన తర్వాత అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి.. కలెక్టర్‌ సంతకం చేస్తారా? లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది.

భారీగా ప్రతిపాదనలు
కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ప్రతి ఏటా రూ.50 కోట్ల నిధులను మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా గత మూడేళ్ల నుంచి రూ.150 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల ఖర్చుపై పూర్తిగా కలెక్టర్‌కే అధికారాలు అప్పగించారు. వాస్తవానికి కలెక్టర్‌ బదిలీ అవుతారనే ప్రచారం గత వారం రోజుల నుంచి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి 18వ తేదీ వరకు ఎస్‌డీపీ కింద పనులు మంజూరు చేయాలంటూ రూ.16.59 కోట్ల మేర విలువైన 142 పనుల ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, కేవలం ఈ రెండు రోజుల్లోనే అంటే 17, 18 తేదీల్లోనే ఏకంగా రూ.9 కోట్ల విలువైన ప్రతిపాదనలు రావడం గమనార్హం. 17వ తేదీన రూ.5.69 కోట్ల విలువైన 43 పనులు, 18వ తేదీన 3.43 కోట్ల విలువైన 22 పనుల కోసం ముగ్గురు సభ్యుల అధికారుల కమిటీకి ప్రతిపాదనలు చేరాయి. ఈ పనులను ఓకే చేస్తూ తాజాగా సీపీఓ ద్వారా కలెక్టర్‌కు ప్రతిపాదనలు చేరినట్టు సమాచారం.

పర్సెంటేజీల పర్వానికి తెర
కలెక్టర్‌ బదిలీ నేపథ్యంలో వస్తున్న ఈ ఎస్‌డీపీ నిధుల పనుల ప్రతిపాదనల వెనుక పర్సెంటేజీల పర్వం నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనులను మంజూరు చేయిస్తామని అధికార పార్టీ నేతలు వసూళ్లకు తెగబడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పనుల మంజూరు కోసం 6 నుంచి 10 శాతం వరకూ కమీషన్‌ వసూలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇది కేవలం పనుల మంజూరు కోసం మాత్రమేనని పేర్కొంటున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ అనుమతిస్తారా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
 

మరిన్ని వార్తలు