తెల్లారిన బతుకులు

30 Apr, 2017 22:32 IST|Sakshi
తెల్లారిన బతుకులు
- నాప బండల ట్రాక్టర్‌ బోల్తా 
- ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
- రాళ్లదొడ్డి- ఎర్రకోట గ్రామాల మధ్య ప్రమాదం
- మృతుల నేత్రాలు దానం చేసిన బాధిత కుటుంబీకులు 
 
రాత్రిగా ఎత్తిన బండలలోడు.. మహా అంటే తెల్లవారుజాముకంతా దింపేస్తాం.. ఆ వెంటనే బయలుదేరి తెల్లారే సరికి ఇంటికి వస్తాం.. అనుకుంటూ నాప బండలలోడు ట్రాక్టర్‌తో బేతంచెర్ల నుంచి ఎమ్మిగనూరు బయలుదేరిన ఓ ముగ్గురిలో ఇద్దరి జీవితాలు మార్గంమధ్యలోనే తెల్లారిపోయాయి. వారు దింపేందుకు వెళ్తున్న బండలలోడే వారిపై పడి ‍ప్రాణాలు బలితీసుకుంది. బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. 
 
ఎమ్మిగనూరురూరల్ :  హమాలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ ఇద్దరి ప్రాణాలను ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. బేతంచెర్లలో ట్రాక్టరుకు నాప బండలను లోడు చేసుకుని ఎమ్మిగనూరు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడగా ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి- ఎర్రకోట గ్రామాల మధ్య రహదారిపై తెల్లవారుజామున 2ః30 గంటల సమయంలో చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ వేణుగోపాల్‌ వివరాల మేరకు.. శనివారం రాత్రి బేతంచర్ల నుంచి ఎమ్మిగనూరుకు నాపబండలలోడుతో బయలుదేరిన ట్రాక్టర్‌(ఏపీ 21టీఎక్స్‌ 8461) తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. మలుపు దగ్గర అదుపు తప్పి ట్రాలీ, ఇంజిన్‌ బోల్తా పడింది. డ్రైవర్‌ మద్దిలేటిస్వామి(39)తోపాటు తలారి సురేష్‌(21), పెద్దమద్దిలేటిపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు గుర్తించి ఫోన్‌ చేయడంతో ఎమ్మిగనూరు రూరల్, పట్టణం, నందవరం ఎస్‌ఐలు వేణుగోపాల్, హరిప్రసాద్, జగన్‌మోహన్‌ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బండలను తొలగించి అందులో ఇరుక్కుపోయిన ముగ్గురిని బయటకు తీశారు.  తీవ్రంగా గాయపడిన వీరిని ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో కర్నూలుకు తీసుకెళ్తుండగా డ్రైవర్‌ మద్దిలేటిస్వామి మరణించాడు. చికిత్స పొందుతూ తలారి సురేష్‌ మృతి చెందాడు. పెద్ద మద్దిలేటి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ వేణుగోపాల్‌ తెలిపారు.
 
బాధిత కుటుంబాల్లో విషాదం..
 ప్రమాదంలో మరణించిన డ్రైవర్‌ మద్దిలేటిస్వామి(39) బేతంచర్ల మండలం గోర్లగుట్టకు చెందిన వారు. ఈయనకు భార్య మద్దమ్మ, ముగ్గురు సంతానం. ఇదే ప్రమాదంలో మరణించిన తలారి సరేష్‌(21) బనగానపల్లె మండలం గోవిందిన్నెకు చెందినవారు. పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండగానే ఇలా తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడంటూ తండ్రి సుంకన్న బోరున విలపించాడు. గాయపడిన పెద్దమద్దిలేటిది కూడా బేతంచర్ల మండలం గోర్లగుట్టనే. విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబాల వారు, బంధువులు పెద్ద ఎత్తున కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. వారి రోదనలతో ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో విషాదం అలుముకుంది.
 
మృతుల నేత్రాలు దానం..
మృతులు మద్దిలేటి స్వామి, తలారి సురేష్‌ నేత్రాలను వారి కుటుంబ సభ్యులు దానం చేసినట్లు సీఐ జీ.ప్రసాద్, రూరల్‌ ఎస్‌ఐ వేణుగోపాల్‌ తెలిపారు. తీవ్ర విషాదం మధ్య డ్రైవర్‌ నేత్రాలను భార్య మద్దమ్మ, సురేష్‌ నేత్రాలను తండ్రి సుంకన్న వైద్యులకు అందించారు.  
 
మరిన్ని వార్తలు