రహదారుల రక్తదాహం

20 Jun, 2017 22:14 IST|Sakshi
రహదారుల రక్తదాహం

మృతులు.. క్షతగాత్రుల రక్తం, అయిన వారి కన్నీళ్లతో రహదారులు తడిసి ముద్దయ్యాయి. మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. అజాగ్రత్త... ఏదైతేనేం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిశాయి. మరో ఐదుగురు రక్తగాయాలతో ఆస్పత్రులపాలయ్యారు. మృతుల్లో ఒకరు కుటుంబ సభ్యులతో కలసి శుభకార్యానికి బయలుదేరిన బాలుడు కాగా, మరో విద్యార్థి ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరిన డిగ్రీ విద్యార్థి.  

- వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు
- ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
- మరో ఐదుగురికి గాయాలు


గుత్తి రూరల్‌ : హైదరాబాద్‌ - బెంగళూరు 44వ నంబర్‌ జాతీయ రహదారిలోని గుత్తి మండలం కొత్తపేట శివార్లలో మంగళవారం ఆటో బోల్తా పడి పెద్దవడుగూరు మండలం మిడుతూరుకు చెందిన అయ్యవార్ల ప్రశాంత్‌కుమార్‌(13) మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మిడుతూరులో ఒకే కుటుంబానికి చెందిన శ్యామలమ్మ(32), స్నేహ(12), వనజ(13), హరిత(12), ప్రశాంత్‌కుమార్‌ కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచెర్లలోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆటోలో ఉదయమే బయలుదేరారు. మార్గమధ్యంలో కొత్తపేట వద్దకు రాగానే డ్రైవర్‌ వేగాన్ని నియంత్రించుకోలేకపోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో మిడుతూరుకు చెందిన నాగలక్ష్మీ, మనోహర్  ఒక్కగానొక్క కుమారుడు ప్రశాంత్‌కుమార్‌ పై నుంచి ఆటో వెళ్లడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. శ్యామలమ్మ, స్నేహ, వనజ, హరిత, ఆటో డ్రైవర్‌ రామాంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు.

లెయ్‌ కొడుకా.. బడికి పోదువు...
లెయ్‌ కొడకా.. బడికి పోదువు.. నువ్వు బడికిపోయిన్నా బతికి ఉండేవాడివి కదరా.. ఎంత పనైంది దేవుడా.. అంటూ ప్రశాంత్‌ మృతదేహంపై పడి తల్లిదండ్రులు రోదించడం కలచివేసింది. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.

మరిన్ని వార్తలు