ప్రాణం తీసిన సరదా

19 Sep, 2017 22:32 IST|Sakshi
ప్రాణం తీసిన సరదా

ఈతకెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
మర్తాడులో విషాదఛాయలు


ముదిగుబ్బ: సరదాగా ఈతకొడదామని వాగులో దిగిన ఇద్దరు చిన్నారులు నీటమునిగి మృత్యువాతపడ్డారు. ఈ ఘటనతో ముదిగుబ్బ మండలం మర్తాడులో విషాదం అలుముకుంది. వివరాల్లోకెళితే.. మాజీ సర్పంచ్‌ పాపిరెడ్డికి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి, కుమార్తె హరిణి ఉన్నారు. హర్షవర్ధన్‌రెడ్డి స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ భార్య, కుమారుడిని పోషించుకుంటున్నాడు. హరిణికి కదిరిలోని వాల్మీకి స్కూల్‌ కరస్పాండెంట్‌ అనిల్‌కుమార్‌రెడ్డితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. హర్షవర్ధన్‌రెడ్డి కుమారుడు వర్షిత్‌రెడ్డి (10) అనంతపురంలోని కేశవరెడ్డి స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్నాడు. హరిణి కుమార్తె అభిజ్ఞ (11) బెంగళూరులో ఆరో తరగతి చదువుతోంది. దసరా సెలవులు కావడంతో పిల్లలు మర్తాడుకు వచ్చారు.

మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులు తోట వద్దకు వెళ్లి తిరిగి వస్తున్నారు. దారిలో మధ్యలో వాగు కనిపించడంతో ఈత కొడదామని ఇద్దరు పిల్లలూ వెళ్లారు. హర్షవర్ధన్‌రెడ్డి గట్టుపై ఉండి పిల్లలను గమనిస్తున్నాడు. చిన్నారులు నీటిలో ఆడుకుంటూ కొద్దిదూరం వెళ్లారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోతూ ‘రక్షించండి’ అంటూ కేకలు వేశారు. హర్షవర్ధన్‌రెడ్డి నీళ్లలోకి దూకగా.. మునిగిపోతున్న వర్షిత్‌రెడ్డి, అభిజ్ఞలు ఆసరా కోసం అతడి మెడను గట్టిగా పట్టుకున్నారు. ఊపిరాడకపోవడంతో అతను వారి చేతులను విదిలించుకుని బయటకు వచ్చాడు. అంతే వర్షిత్‌రెడ్డి, అభిజ్ఞలు నీటమునిగి ప్రాణం విడిచారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు (వరుసకు బావా మరదలు) మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎస్‌ఐ మగ్బూల్‌ బాషా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బాధిత కుటుంబానికి సిద్ధారెడ్డి పరామర్శ
చిన్నారులు అభిజ్ఞ, వర్షిత్‌రెడ్డిలు మృతి చెందిన విషయాన్ని తెలుసుకొన్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డి బాధిత కుటుంబ సభ్యులను కదిరిలో పరామర్శించారు.

మరిన్ని వార్తలు