గుండెపోటుతో ఇద్దరు రైతుల మృతి

10 Sep, 2016 00:06 IST|Sakshi

బత్తలపల్లి : వేరుశనగ పంట ఎండిపోయి దిగుబడి దక్కదన్న కారణంతో మనోవేదనకు గురైన ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శుక్రవారం బత్తలపల్లి మండలంలో చోటు చేసుకుంది వివరాలు.. మండలంలోని వెంకటగారిపల్లి గ్రామానికి చెందిన ఎస్‌.నారాయణస్వామి(48) తనకున్న ఎకరా భూమితో పాటు ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వేరుశనగ పంటను సాగు చేశాడు. పంటల సాగుకు బంగారును బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ప్రైవేట్‌గా రూ.లక్ష అప్పు చేశాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న నారాయణస్వామి కలెక్షన్‌ లేని కారణంగా ఆటోను సైతం అమ్మివేశాడు.

వర్షాభావం కారణంగా వేరుశనగ ఎండిపోవడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక ఆవేదన చెందేవాడని  భార్య నారాయణమ్మ వాపోయింది. గురువారం రాత్రి అతడికి గుండె నొప్పి రావడంతో ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకుపోయారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి భార్యతో పాటు కుమారుడు ప్రసాద్, కుమార్తె ఉన్నారు. అలాగే మండలంలోని గరిశలపల్లి గ్రామానికి చెందిన గాండ్ల చిన్న వెంగముణి(49) తనకున్న నాలుగు ఎకరాలతో పాటు ఆరు ఎకరాలను కౌలుకు తీసుకొని వేరుశనగ పంటను సాగు చేశాడు. కూతురి చదువుకు, పంటలు సాగుకు లక్షల్లో అప్పు ఉన్నట్లు భార్య రమణమ్మ తెలిపింది. వర్షాభావంతో వేరుశనగ పంట ఈ ఏడాది చేతికి దక్కేది అనుమానమేనని ఆందోళన చెందుతుండేవాడని వాపోయింది. బ్యాంకులో రూ.71 వేలు, ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రూ.5 లక్షలు అప్పులు ఉన్నట్లు తెలిపారు. గురువారం అర్ధరాత్రి గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి వచ్చేలోపు అతడు మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని వార్తలు