రెండు గోడౌన్లు సీజ్‌

16 Aug, 2016 23:02 IST|Sakshi

ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున లభించిన శాంపిల్స్‌ మందులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సీజ్‌ చేసిన ఔషధాల విలువ రూ.లక్షల్లో ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి విజిలెన్స్, ప్రొద్దుటూరు డీఎస్పీలు దాడులు నిర్వహించి.. భారీగా నిల్వ ఉంచిన ఔషధాల గోడౌన్‌లను గుర్తించారు. శ్రీరాంనగర్‌ సమీపంలోని దేవాంగపేటలో ఓ ఇరుకు వీధిలో ఈ రెండు గోడౌన్‌లు ఉన్నాయి.

వీటిని సీజ్‌ చేసిన పోలీసులు వాటి యజమానులను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి నుంచి గోడౌన్‌ల వద్ద పోలీస్‌ సిబ్బందిని కాపలాగా ఉంచారు. పోలీస్‌ అధికారులు విషయాన్ని ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు తెలిపారు. విశాఖపట్టణంలో ఉన్న ఇన్‌చార్జి డీఐ శ్రీనివాసమూర్తి హుటాహుటిన బయలుదేరారు. బుధవారం ఉదయం ఆయన ప్రొద్దుటూరు చేరుకుని గోడౌన్‌లలో ఉన్న శాంపిల్‌ మందులను పరిశీలిస్తారు. అవి ఏ బ్యాచ్‌కు చెందినవి, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు, శాంపిల్‌ మందులు కలిగిన వారికి లైసెన్సు ఉందా లేదా అనే విషయాలను విచారణ చేస్తామని డీఐ ‘సాక్షి’తో అన్నారు.


మరో గోడౌన్‌లోని శాంపిల్స్‌ మాయం?
పట్టణంలోని మూడు గోడౌన్‌లలో పెద్ద ఎత్తున శాంపిల్‌ మందులు ఉన్నాయని విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ముందుగా దేవాంగపేటలో ఉన్న గోడౌన్‌ వద్దకు వారు వెళ్లారు. ఈ విషయం తెలియడంతో కొంత దూరంలో ఉన్న మెడికల్‌  షాపు యజమాని తన గోడౌన్‌లోని శాంపిల్స్‌ను నిమిషాల్లో మరో చోటికి తరలించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రెండు గోడౌన్‌లలో ఉన్న శాంపిల్‌ ఔషధాలను మాత్రమే సీజ్‌ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు కూడా ఈ విషయాన్ని అధికారులకు వెల్లడించారు. కాగా పోలీసుల అదుపులో ఉన్న శాంపిల్‌ గోడౌన్‌ల నిర్వాహకులను వదలిపెట్టాలని పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు నాయకుల ద్వారా పోలీసులకు చెప్పించినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు