పోడు..ఫైట్

5 Jul, 2016 08:19 IST|Sakshi
పోడు..ఫైట్

ప్రభాత్‌నగర్‌లో ఎన్డీ రెండు వర్గాల మధ్య ఘర్షణ
పరస్పరం దాడులు చేసుకున్న రాయల, చంద్రన్న శ్రేణులు

పాల్వంచ రూరల్: పోడుభూమి తమదంటే..తమదంటూ సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీలోని రాయల, చంద్రన్న వర్గాల వారు పోటీ పడడంతో..సోమవారం పాండురంగాపురం గ్రామ పంచాయతీ ప్రభాత్‌నగర్‌లో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. బడితెలు చేతబట్టి ఊరిలో తీవ్రంగా కొట్టుకున్నారు. పలువురు గాయపడ్డారు.

 గొడవెందుకొచ్చిందంటే..
ప్రభాత్‌నగర్(రెడ్డిగూడెం)లో రెండు నెలల క్రితం న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన రాయల సుభాష్‌చంద్రబోస్, చంద్రన్న వర్గాల వారు కలిసి 20ఎకరాల అటవీ భూమిలో చెట్లు నరికి పోడుభూమిగా మార్చారు. 15ఎకరాల విషయంలో రెండు వర్గాల మధ్య తమదంటే..తమదంటూ పోటీ నెలకొని కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం రాయలవర్గం నాయకులు, స్థానికులు ట్రాక్టర్లలో ఆ పోడు భూమి వద్దకు వెళుతుండగా చంద్రన్నవర్గీయులు అడ్డుకున్నారు.

దీంతో ఇరు వర్గాల వారు కర్రలు, రాళ్లతో దాడులు జరుపుకున్నారు. చంద్రన్న వర్గీయులైన నల్లబోతు కుమారి, లింగయ్య, వీరమల్లు మల్లేష్, సురేష్‌లకు గాయాలయ్యాయి. రాయలవర్గం వారు వచ్చిన ట్రాక్టర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాడుల అనంతరం రాయలవర్గీయులు ట్రాక్టర్లలో వెళ్లి పోడుకు సిద్ధం చేసుకున్న 15 ఎకరాల్లో ఎర్రజెండాలు పాతారు. విత్తనాలు చల్లారు. ఈ ఘర్షణతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామంలో ఉద్రిక్తత కొనసాగింది. ఇరువర్గాల ఫిర్యాదుతో 36మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 క్లైమాక్స్‌లో పోలీసులు
ప్రభాత్‌నగర్ లో ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఘర్షణ కొనసాగినా, ఎప్పుడేం జరుగుతుందోననే భయానక పరిస్థితులు నెలకొన్నా..పోలీసులు మాత్రం సకాలంలో అక్కడికి చేరుకోలేకపోయారు. గొడవ అనంతరం ఫిర్యాదుచేశాక రూరల్ ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బంది గ్రామంలోకి వచ్చి పరిస్థితిని అంచనా వేశారు. స్థానికులతో మాట్లాడి వివాదానికి గల కారణాలు తెలుసుకున్నారు.

దళం గమనించిందా..?
ప్రభాత్‌నగర్‌లో న్యూడెమోక్రసీలోని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రత్యక్షంగా సివిల్ దుస్తుల్లో ఓ అజ్ఞాతదళ కమాండర్ పాల్గొన్నట్లు సమాచారం. చంద్రన్న వర్గం నుంచి రామన్న దళం కూడా  గ్రామ సమీపంలోని గుట్టల్లో ఉండి పరిస్థితిని గమనించినట్లు తెలిసింది. పోడుభూమి విషయంలో..కీలకమైన రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో..ఊరిలో ఉద్రిక్తత నెలకొంది.

>
మరిన్ని వార్తలు