రెండు క్వింటాళ్ల గంజాయి పట్టివేత

2 Jul, 2016 08:53 IST|Sakshi
రెండు క్వింటాళ్ల గంజాయి పట్టివేత

ఎడపల్లి కేంద్రంగా ఢిల్లీకి రవాణా
ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు, పరారీలో ఒకరు
రూ. 7.12 లక్షలు స్వాధీనం, కారు సీజ్

 నిజామాబాద్ క్రైం : జిల్లా కేంద్రంగా అక్రమ రవాణా చేస్తున్న ఎండు గంజాయిను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రెండు క్వింటాళ్ల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 7.12 లక్షలు ఉంటుంది. ఒకరు తప్పించుకోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలను ఎస్పీ విశ్వప్రసాద్ శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులకు వివరించారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టు రాజ్‌నగర్‌కు చెందిన రాజ్‌కుమార్ పదేళ్లుగా విశాఖపట్నం జిల్లా నుంచి గంజాయిని తీసుకెళ్లి ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఇతనికి సహాయకులుగా ఢిల్లీలోని జై చాపల్ ఆర్‌కే పురం సబ్జి మార్కెట్ ప్రాంతానికి చెందిన ఎస్.విజయ్‌పాల్, అమిత్‌సింగ్(కారుడ్రైవర్)లు ఉన్నారు.

విశాఖపట్నం జిల్లా నర్సిపట్నంలో కిలో గంజాయి రూ. 5 వేలకు కొనుగోలు చేసి ఢిల్లీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలు నోయిడా, ఆగ్రాలలో రూ. 40 వేల నుంచి 50 వేల వరకు విక్రయించేవాడు. వర్ని మండలం శ్రీనగర్‌కు చెందిన జడిగే శంకర్ కూడా నర్సిపట్నం నుంచి గంజాయిను తీసుకువచ్చి మహారాష్ట్ర ప్రాంతానికి సరఫరా చేసేవాడు. ఇతనిపై 2006 సంవత్సంలో కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంత రం బయటకు వచ్చిన శంకర్‌పై పోలీసులు నిఘా పెట్టలేదని ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో శంకర్‌కు ఢిల్లీకి చెందిన వారితో విశాఖపట్నంలో పరిచయం ఏర్పడింది.

శంకర్ పెద్దఎత్తున గంజాయిని కొనుగోలు చేస్తుండడంతో ఢిల్లీకి చెందిన వారు ఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకు వచ్చే బదులు నిజామాబాద్‌లో శంకర్ వద్ద నుంచి గంజాయిను కొనుగోలు చేస్తే దూర భారం తగ్గుతుందని భావించారు. అందులో భాగంగా గతనెల 29న ఢిల్లీ నుంచి రాజ్‌కుమార్, విజయ్‌పాల్, అమిత్‌సింగ్‌లు హోండా సిటీ డీఎల్ 4సీ ఎన్‌ఏ 1853 నంబరు కారులో రూ. 7.12 లక్షలు తీసుకుని బోధన్‌కు వచ్చారు. వారికి శంకర్ బోధన్‌లోని గౌతమి లాడ్జ్‌లో ఓ ప్రత్యేక గది తీసుకుని ఆశ్రయం కల్పించాడు. అనంతరం మరుసటి రోజు గతనెల 30న ఉదయం లాడ్జ్‌లోనే గంజాయి అమ్మకానికి సంబంధించి లావాదేవీలు జరిగాయి. మొత్తం రెండు క్వింటాళ్లకు రూ. 5,32 లక్షలు చెల్లించాలని శంకర్ తెలపడంతో రాజ్‌కుమార్ చెల్లించాడు. మిగతా రూ. 1.80 లక్షలు ఖర్చుల నిమిత్తం ఉంచుకున్నాడు. శంకర్ ఎడపల్లిలో అద్దెకు తీసుకున్న పౌల్ట్రీఫారంలో డంపుచేసి పెట్టిన గంజాయిను ఢిల్లీ స్మగ్లర్లకు అప్పగించాడు.

 పట్టుబడ్డారిలా...
ఎడపల్లిలోని పౌల్ట్రీఫారం నుంచి రెండు క్వింటాళ్ల గంజాయి ప్యాకెట్లను కారులో వేసుకుని నిందితులు ఢిల్లీకి బయలు దేరారు. ఎడపల్లి నుంచి కారు నిజామాబాద్‌కు వస్తుండగా కారు వెనుక బైక్‌పై వస్తున్న గుర్తు తెలియని వ్యక్తులకు గంజాయి వాసన రావడంతో వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు. నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో జన్నేపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసిన స్మగ్లర్లు కారును వెనక్కి పోనిచ్చేందుకు ప్రయత్నించి విఫలమై పోలీసుల వద్దకు అనుమానంగా చేరుకున్నారు. పోలీసులు కారును చుట్టుముట్టగా కారును నడుపుతున్న అమిత్‌సింగ్, గంజాయి విక్రయించిన శంకర్‌లు కారులో నుంచి దిగి పారిపోయారు. కారులో ఉన్న రాజ్‌కుమార్, విజయ్‌పాల్‌లు పోలీసులకు చిక్కారు. పోలీసులు వీరిద్దరితో పాటు కారును రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 హైడ్రామా నడుమ శంకర్ అరెస్టు
జన్నేపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద రూరల్ పోలీసులు ఢిల్లీకి బయలుదేరిన కారును పట్టుకోగానే అందులో ఉన్న శంకర్ పోలీసులను ఏమార్చి తప్పించుకున్నాడు. వెంటనే పోలీసులు వైర్‌లెస్ సెట్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్సైలను అప్రమత్తం చేశారు. శంకర్ ఓ ఆటోలో వర్నివైపు వెళ్తుండగా వర్ని మండలం అక్బర్‌నగర్ వద్ద వర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 5.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్ అమిత్‌సింగ్ కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ముగ్గురి స్మగ్లర్ల నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. అక్రమ గంజాయి రవాణ  కేసులో మరో ముగ్గురి పాత్ర ఉందని వారి గురించి ఆరా తీస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి కేసును చేధించిన రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై చందర్‌రాథోడ్, ఏఎస్సై గురువప్పా, కానిస్టేబుల్స్ శ్రీకాంత్, కృష్ణ, పోచయ్య, హోంగార్డులను ఎస్పీ అభినందించారు. వీరికి రివార్డులను ప్రదానం చేశారు.

మరిన్ని వార్తలు