ఇద్దరు గెరిల్లా స్క్వాడ్‌ సభ్యుల లొంగుబాటు

8 Sep, 2016 23:40 IST|Sakshi
లొంగిపోయిన గెరిల్లా స్క్వాడ్‌ కమిటీ సభ్యులు

చర్ల : ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ఇద్దరు మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా స్పెషల్‌ గెరిల్లా స్క్వాడ్‌ సభ్యులు వెంకటాపురం సీఐ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు సీఐ సాయిరమణ స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. చర్ల మండలం పెదమిడిసిలేరు గ్రామ పంచాయతీలో గల ఎర్రంపాడుకు చెందిన వేకో జోగయ్య అలియాస్‌ జంగు.. 2008లో అప్పటి మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు సుఖదేవ్‌ నేతృత్వంలో మావోయిస్టు పార్టీలో చేరాడు. చురుకుగా పనిచేస్తున్న అతడికి 2009లో మిలీషియా సభ్యుడిగా పదోన్నతి కల్పించగా.. 2010 వరకు మిలీషియా కమిటీ సభ్యుడిగా పనిచేసిన ఆయన 2010లో స్పెషల్‌ గెరిల్లా స్క్వాడ్‌ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడు. మావోయిస్టు నేత లచ్చన్న నేతృత్వంలో  2016 వరకు పనిచేసిన జంగు పలు విధ్వంసాల్లో పాల్గొన్నట్లు సీఐ తెలిపారు. 2013లో స్పెషల్‌ గెరిల్లా స్క్వాడ్‌ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు జోగయ్య అలియాస్‌ జంగు.. మావోయిస్టు పార్టీలో దళ సభ్యురాలిగా పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా ఊసూరు బ్లాక్‌ రాంపురానికి చెందిన నూపా పాయికెను వివాహం చేసుకున్నాడు. ఇతడు కుర్నపల్లి, మినప, సింగం ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొనడంతోపాటు ఆంజనేయపురం సమీపంలోని ప్రధాన రహదారిపై మందుపాతరల ఏర్పాటు, చర్లలో పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసుల ఆటోపై కాల్పులు జరపడం, పెదమిడిసిలేరులోని జీసీసీ రేష¯ŒS షాపు, సత్యనారాయణపురంలోని స్టేట్‌ బ్యాంక్‌ లూటీ, బూరుగుపాడుకు చెందిన రవ్వా సింగయ్య హత్య, చలమలకు చెందిన కొర్సా చౌతు అలియాస్‌ మడకం సంతు హత్య, చలమలలో జేసీబీ దగ్ధం వంటి విధ్వంసకర సంఘటల్లో పాల్గొనగా.. అతడిపై మొత్తం 19 కేసులు నమోదైనట్లు సీఐ వివరించారు. 2012లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా ఊసూరు బ్లాక్‌లోని రాంపురానికి చెందిన నూపా పాయికె అప్పటి మావోయిస్టు పార్టీ జననాట్య మండలి కళారూపాలకు ఆకర్షితురాలై మావోయిస్టు పార్టీలో చేరింది. ఆ తరువాత ఖమ్మం జిల్లా మావోయిస్టు పార్టీ స్పెషల్‌ గెరిల్లా స్క్వాడ్‌లో ఈమెకు అవకాశం రాగా.. అందులో పనిచేస్తున్న సందర్భంలో 2013లో వేకో జోగయ్య అలియాస్‌ జగ్గుతో వివాహం జరిగింది. వివాహం తరువాత సత్యనారాయణపురంలో 2014లో బీఎస్‌ఎ¯ŒSఎల్‌సెల్‌ టవర్‌ దగ్ధం చేసేందుకు వచ్చినప్పుడు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో భర్తతో కలిసి ఈమె కూడా పాల్గొనగా.. సెల్‌టవర్‌ వద్ద జరిగిన ఎదురు కాల్పులకు సంబంధించి కేసు ఈమెపై ఉంది. భార్యాభర్తల ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో సీఐ ఎదుట లొంగిపోయారు. వీరికి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించి, వీరిని ఆదుకుంటామని సీఐ తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు