రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

17 Nov, 2016 04:49 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

ఢీకొన్న ఆటో- బొలెరో వాహనం మరో ఇద్దరికి గాయాలు
మృతుల్లో ఒకరు జార్ఖండ్‌వాసి, మరొకరు విద్యార్థి
మలుపువద్ద సూచికలు లేకపోవడమే కారణం

 భూత్పూర్ : నాగర్‌కర్నూలు-మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై ఉన్న మండలంలోని చౌళ్లతండా మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇటీవలే ఆ మలుపు ఇద్దరిని బలి తీసుకోగా తాజా గా బుధవారం మరో ఇద్దరి చావుకు కారణమైంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా.. బిజినేపల్లికి చెందిన ఆటో (టీఎస్ 06,యూబీ,1262) బుధవారం ఉదయం ప్రయాణికులను తీసుకొని భూత్పూర్‌కు బయల్దేరింది. కొత్తకోటకు చెందిన రహమాన్ (20) అనే యువకుడు అమ్మమ్మ గారి ఊరు బిజినేపల్లికి వెళ్లి అదే ఆటో ఎక్కాడు. మార్గమధ్యంలోని ఎల్కిచర్ల వద్ద మిషన్‌భగీరథ పథకంలో పనిచేయడానికి వచ్చిన జార్కండ్ రాష్ట్రం చాత్రి మండలం విత్తకోరి గ్రామానికి చెందిన ప్రకాశ్ యాదవ్ (30) అనే కార్మికుడితోపాటు మరికొందరు ఆటోలో బయల్దేరారు.

వాహనం చౌళ్లతండా మలుపు వద్దకు రాగానే అదే సమయంలో భూత్పూర్ నుంచి నాగర్‌కర్నూల్ వైపుకు వెళ్తున్న (ఏపీ21టీయూ 1607) బొలెరో వాహనం  ఢీ కొంది. రెండు వాహనాల వేగం అతిగా ఉండటం, మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న ప్రకాశ్‌యాదవ్, రహమాన్‌లు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు.  డోకూర్‌కు చెందిన జయమ్మ, శ్రీశైలమ్మలకు స్వల్ప గాయాలయ్యారుు.  స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్‌ఐ అశోక్ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని, మృతదేహాలను 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు.

అనంతరం పంచనామా నిర్వహించారు. వారి వద్ద నుంచి లభించిన వివరాలను తెలుసుకొని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఇదిలావుండగా కొత్తకోటకు చెందిన తహసీల్‌సుల్తానా, సిరాజొద్దీన్‌ల రెండో కుమారుడు రహమాన్ మహబూబ్‌నగర్‌లో బీఫార్మసీ చదువుతున్నాడు. ఆస్పత్రి ఆవరణలో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటారుు. ఈ సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.

హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలి
చౌళ్లతండా స్టేజీ మలుపు వద్ద వరుసగా ప్రమాదాలు జరుగుతున్నారుు. ఇటీవలే బిజినేపల్లికి వెళ్తున్న ఇద్దరు యువకులు అదే మలుపు వద్ద ప్రమాదం బారిన పడి చనిపోయారు. ఆ ప్రాంతంలో ఎలాంటి సూచికలు  లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారుు. పోలీసులు, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పీడ్‌బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు