పతివాడపాలెంలో విషాదం

13 Sep, 2017 09:12 IST|Sakshi
పతివాడపాలెంలో విషాదం

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి
అనుమానాస్పదస్థితిలో ఒకరు, విద్యుదాఘాతానికి గురై మరొకరు బలి


రణస్థలం మండలం పతివాడపాలెం గ్రామంలో విషాదం నెలకొంది. రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. అనుమానాస్పదస్థితిలో రోడ్డు పక్కన ఒకరు ప్రాణాలు కోల్పోగా, విద్యుదాఘాతానికి గురై ఇంకొకరు చనిపోయారు. ఇందులో ఒకరిది ఇదే గ్రామం కాగా, మరొకరు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఇసుకపల్లి నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. వివరాలు ఇలావున్నాయి. – రణస్థలం

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి
ముగ్గురు ఆడపిల్లలతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నమృతుని భార్య


పతివాడపాలెం గ్రామానికి చెందిన ఎన్ని సూర్యనారాయణ(42) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఇంటికి సమీపంలోని తోటలో టేకు చెట్టుకు రొమ్మలు కొడుతుండగా ప్రమాదం సంభవించింది. కోసిన రొమ్మలు పక్కనే ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలపై పడ్డాయి.

ఇది గమనించని సూర్యనారాయణ ఆ రొమ్మలు పట్టుకున్నాడు. దీంతో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇతడు వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతదేహంపై పడి కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడి వారికి కంటతడి పెట్టించింది. అందరితో సరదాగా ఉండే సూర్యనారాయణ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య పెంటమ్మ, ముగ్గురు ఆడపిల్లలు దేవి(13), గౌరి(15), ఈశ్వరమ్మ(16) ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లలకు ఇంకా పెళ్లి కాకపోవడంతో మృతుడి భార్య లబోదిబోమంటూ విలపిస్తుంది. రెక్కాడితే గాని డొక్కాడని ఈ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోవడంతో రోడ్డున పడింది. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని జె.ఆర్‌.పురం ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు.   

హత్య... ప్రమాదమా!
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

ఊరు కాని ఊరు వచ్చి బతుకుతున్న ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడా, లేక ఎవరైనా హత్య చేసి రోడ్డున పక్కన పడేశారా అనేది అంతుపట్టడం లేదు. పతివాడపాలెం గ్రామంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన కోన వీర చక్రరావు(43) సమీపంలోని పైడిపేట వద్ద జాతీయ రహదారి పక్కన మంగళవారం మృతిచెంది ఉండడాన్ని కొందరు వ్యక్తులు గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. జె.ఆర్‌.పురం సీఐ, ఎస్సై వై.రామకృష్ణ, ఎస్సై వి.సత్యనారాయణ, పైడిభీమవరం ఎస్సై బి.శ్రీరామూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని బంధువులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఇసుకపల్లి గ్రామానికి చెందిన కోన వీర చక్రరావు కుటుంబంతో సహా కొన్నేళ్ల కిందట పతివాడపాలెం గ్రామానికి వచ్చి నివసిస్తున్నాడు.

మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న మొక్కలకు నీరుపోసి బయటకు వెళ్లాడు. ఈ గ్రామానికి సమీపంలోని పైడిపేట వద్ద జాతీయ రహదారి పక్కన మృతి చెంది పడివున్నాడు. అయితే ఇతడు జాతీయ రహదారి పక్కన ఉన్న క్రాస్‌ బేరియర్స్‌ అవతల వైపు ఎలా వెళ్లాడనేది ప్రశ్నగా మారింది. రోడ్డుపై వెళుతున్నప్పుడు గుర్తుతెలియని వాహనం ఢీకొని ఉంటే తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెంది ఉండాలి. లేకపోతే వాహనం ఢీకొన్న తర్వాత ఎవరైనా  అవతలవైపు పడేశారా అనేది తెలియరావడం లేదు. అయితే వీర చక్రరావుకు గతంలో ఎవరితోనూ తగాదాలు, గొడవలు లేవని బంధువులు చెబుతున్నారు. భార్య, పిల్లలు రెండు రోజుల క్రితమే మృతుడు స్వగ్రామం ఇసుకపల్లి వెళ్లారని తెలిపారు. ఈ సంఘటనపై జె.ఆర్‌.పురం ఎస్సై వి.సత్యనారాయణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు