పెళ్లి పేరుతో ఒకరు రుణాలంటూ మరొకరు?

6 Oct, 2016 22:33 IST|Sakshi
టి.కృష్ణ, అబ్దుల్‌ షరీఫ్‌

సాక్షి, సిటీబ్యూరో: మంచి పెళ్లి సంబంధాలు, తక్కువ వడ్డీకి రుణాల పేరుతో జనాన్ని నిలువునా ముంచుతున్న మోసగాళ్లను సిటీ సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొం దరి కోసం గాలిస్తున్నారు. డీసీపీ అవినాష్‌ మహంతి కథనం ప్రకారం... గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన అబ్దుల్‌ షరీఫ్‌ షేక్‌ నగరానికి వలస వచ్చి సనత్‌నగర్‌లో స్థిరపడ్డాడు. చిరుద్యోగి అయిన ఇతడికి వస్తున్న జీతం సరిపోకపోవడంతో మోసాలకు తెరలేపాడు.

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన మల్లేష్‌ను తనతో చేర్చుకుని రంగంలోకి దిగాడు. అర్హులకు తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణాలు ఇస్తామంటూ వీరు పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు. రుణాలు తీసుకోవడానికి ఆసక్తిచూపిన వారు ప్రకటనల్లో పేర్కొన్న నెంబర్లను సంప్రదించే వారు. ఆ ఫోన్లు రిసీవ్‌ చేసుకునే వీరు వివిధ రకాలైన ప్రశ్నలు అడిగిన తర్వాత రుణం మంజూరైనట్లు చెప్తున్నారు. అయితే ఈ ద్వయం రుణం ఇవ్వడంలో ఓ చిత్రమైన లాజిక్‌ చెప్పేది.

తమకు బజాజ్‌ ఎలక్ట్రానిక్స్, తిరుపతి ఎలక్ట్రానిక్స్‌తో ఒప్పందాలు ఉన్నాయని నమ్మబలికేది. హబ్సిగూడ, పంజగుట్టల్లో ఉన్న ఆ షోరూమ్స్‌కు వెళ్లి మార్జిన్‌ మనీ చెల్లించడం ద్వారా సులభవాయిదాల పద్ధతిలో వస్తువులు ఖరీదు చేసి తమకు ఇవ్వాలని, వాటి ని తాము ఖరీదు చేసి నగదు ఇస్తామని, షోరూమ్‌కు సులభవాయిదాల్లో మొత్తం చెల్లించవచ్చని ఈ ద్వయం వల వేసేది.  తార్నాకకు చెందిన దీప పత్రికల్లో ప్రకటన చూసి వీరిని సంప్రదించారు.

ఆమె అర్హతలు తెలుసుకున్న ద్వయం రూ.2 లక్షల రుణం ఇస్తామంది.  ఆపై ‘షోరూమ్‌ లాజిక్‌’ చెప్పారు. దీంతో దీప వీరు చెప్పినట్లు రూ. 73 వేల మార్జిన్‌ మనీ చెల్లించి రూ.74 వేల వస్తువులు ఖరీదు చేశారు. వీటిని ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ వద్ద కలెక్ట్‌ చేసుకున్న నిందితులు వారం రోజుల్లో రుణం రూ.2 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు.

కొన్ని రోజులు ఎదురు చూసినా తనకు డబ్బు అందకపోవడంతో పాటు వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ రావడంతో మోసపోయినట్టు గుర్తించిన దీప పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.శంకర్‌రాజు నేతృత్వంలోని బృందం గురువారం నిందితుడు షరీఫ్‌ షేక్‌ను అరెస్టు చేశారు.

పెళ్లి సంబంధాల పేరుతో మరొకరు...
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన టి.కృష్ణ వనస్థలిపురంలో స్థిరపడ్డాడు. వివిధ పత్రికల్లో వివాహ సంబంధాలు కుదురుస్తామంటూ ప్రకటనలు ఇచ్చేవాడు. ఆకర్షితులైన వారు ఆ ప్రకటనలో ఇచ్చిన ఫోన్‌ నెంబర్లకు కాల్‌ చేస్తే... వారికి కొన్ని ఈ–మెయిల్‌ ఐడీలు ఇచ్చి వాటికి బయోడేటా, ఫొటోలు పంపమనేవాడు.  ఆపై మంచి సంబంధం ఉందని తన బ్యాంకు ఖాతాలో రూ.5 వేలు డిపాజిట్‌ చేయించుకునే వాడు.

పెళ్లికుమారుడు/కుమార్తె తరఫు వారిదిగా చెప్తూ ఓ సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఇచ్చేవాడు. బాధితులు తొలిసారి కాల్‌ చేసినప్పుడు అవతలి వైపు నుంచి పురుషులు/స్రీ్తలు పెళ్లి పెద్దలుగా మాట్లాడేవారు.  వీరిని కూడా కృష్ణ ఏర్పాటు చేసే వాడు. అనేక అంశాలు చర్చించిన తర్వాత సంబంధం తమకు సమ్మతమంటూ చెప్పేవారు. ఆపై సదరు ఫోన్‌ నెంబర్‌ స్విచ్ఛాఫ్‌లో ఉండేది. దీంతో బాధితులు మళ్లీ కృష్ణను సంప్రదించగా... మరో రూ.3 వేలు డిపాజిట్‌ చేస్తే సంబంధం కుదురుస్తామనేవాడు.

దీంతో బాధితులు అలా చేసినప్పటికీ ‘డమ్మీల’ నుంచే కాదు... చివరకు కృష్ణ నుంచీ స్పందన ఉండేది కాదు. దీంతో మోసపోయామని గుర్తించే బాధితులు తక్కువ మొత్తాలే కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేవారు కాదు.  ఖమ్మం జిల్లా నుంచి వచ్చి బ్యాంక్‌ స్ట్రీట్‌లో స్థిరపడిన జె.శ్రీదాస్‌ను గత నెల్లో కృష్ణ ఇదే పంథాలో మోసం చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ పర్యవేక్షణలో దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని గుర్తించి గురువారం అరెస్టు చేశారు.

 

మరిన్ని వార్తలు