రిజర్వాయర్‌లో ఇద్దరి గల్లంతు

31 Jul, 2016 23:28 IST|Sakshi
రిజర్వాయర్‌లో ఇద్దరి గల్లంతు
  • ఒకరి మృతదేహం లభ్యం
  • మరొకరి ఆచూకీ కోసం గాలింపు
  • చేపల వేట సరదాతో ప్రమాదం
  • ధర్మసాగర్‌ : సరదా కోసం చేసిన చేపల వేట.. ఆ ఇద్దరు యువకులు రిజర్వాయర్‌లో గల్లంతు కావడానికి కారణంగా మారింది. ఈ ఘటన ధర్మసాగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ధర్మసాగర్‌కు చెందిన  పొలుమారి థామస్‌ చిన్న కుమారుడు పొలుమారి సృజన్‌(25), మాచర్ల మల్లయ్య చిన్న కుమారుడు మాచర్ల సునీల్‌(25), డీజిల్‌ కాలనీకి చెందిన సందె మోహన్‌లు చిన్ననాటి నుంచి మంచి మిత్రులు. కాగా, సృజన్‌ నర్సంపేటలో, సందె మోహన్‌ మిల్స్‌ కాలనీలో కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. సునీల్‌ «దర్మసాగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. వీరు ముగ్గురు వారాంతంలో కలుసుకునేవారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం వీరి ముగ్గురితో పాటు పొలిమారి సృజన్‌ అన్న పొలిమారి సుమంత్‌ కలిసి స్థానిక రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లారు. 
     
    నీటి ప్రవాహ వేగానికి..
    ఈతకొట్టిన అనంతరం పొలిమారి సృజన్, మాచర్ల సునీల్, సందె మోహన్‌లు దోమతెరతో చేపలు పట్టడానికి దేవాదుల పైపులు నీరుపోస్తున్న ప్రదేశంలో నీటిలోకి దిగారు. చేపలు పట్టాలనే తాపత్రయంలో ఒక్కో అడుగు వేస్తూ లోపలికి దిగారు. ఒక్కసారిగా లోతు రావడంతో నీటి ప్రవాహ వేగానికి మాచర్ల సునీల్‌ కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు సృజన్, మోహన్‌లు యత్నించారు. ఈక్రమంలో సునీల్, సృజన్‌ గల్లంతయ్యారు. సందె మోహన్‌ మాత్రం సమీపంలోని ముళ్ల చెట్టును పట్టుకొని జల ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అక్కడే ఉన్న సృజన్‌ అన్న సుమంత్, స్థానికులు సునీల్, సృజన్‌లను కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. కాజీపేట ఏసీపీ జనార్దన్, మడికొండ సీఐ డేవిడ్‌ రాజ్, ధర్మసాగర్‌ పీఎస్సై సతీష్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకొని దేవాదుల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి మోటార్ల పంపింగ్‌ను ఆపివేయించారు. అనంతరం స్థానిక జాలర్లతో మృతదేహాల కోసం రిజర్వాయర్‌లోSగాలించగా మాచర్ల సునీల్‌ మృతదేహం లభ్యమైంది. పొలిమారి సృజన్‌ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఎమ్మెల్యే రాజయ్య సంఘటనా స్థలాన్ని సందర్శించారు. యువకుడి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బైరపాక జయాకర్, సర్పంచ్‌ కొలిపాక రజిత ఉన్నారు. కాగా, పొలుమారి సృజన్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే ఇటీవల ఎస్సై మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించడం గమనార్హం. 
మరిన్ని వార్తలు