రాజ్యసభ రేసులో ఆ ఇద్దరు

4 May, 2016 05:07 IST|Sakshi

నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఎన్నికల వేడి ఊపందుకుంది. రేపో, మాపో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుండటంతో పెద్దల సభలో అడుగుపెట్టాలనుకుంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం ఈ సారి  జిల్లా నుంచి ఎవరికీ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండదని ముఖ్య నేతలకు చెబుతున్నారు.

అప్పటి హామీ గుర్తు చేస్తున్న ఆదాల
రెండేళ్ల కిందట శాసనభసభ, లోక్‌సభకు ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరారు. నెల్లూరు లోక్‌సభకు పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితిలో ఆదాలను చంద్రబాబు రంగంలోకి దించారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలైనా రాజ్యసభకు అవకాశం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు అప్పట్లో టీడీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఆదాల ఓడిపోవడం, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటంతో ఆ తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని చంద్రబాబు ఆదాలను కోరారు. అయితే ఎన్నికల ముందు జరిగిన ఒప్పందాల నేపథ్యంలో చంద్రబాబు జిల్లా నుంచి పొంగూరు నారాయణకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అవకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఇచ్చారు. రాజ్యసభ స్థానం మీద ఎప్పటి నుంచో ఆశ పెట్టుకున్న ఆదాల అప్పట్లో మిన్నకుండి పోయారు. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబుకు తన మనసులోని కోరికను, 2014 ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ వస్తున్నారు. మంత్రి నారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్ల ఈ కోణంలో కూడా చంద్రబాబును ప్రసన్నం చేసుకునే రాజకీయం నడుపుతూ వచ్చారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

 బీద అదృష్ట పరీక్ష
గడచిన ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బీద మస్తాన్‌రావు సైతం రాజ్యసభ రేసులో తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. పార్టీ అధికారంలో లేని సమయంలో తాను చేసిన సేవలను గుర్తించి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరుతున్నారు. నియోజక వర్గంలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలంటే తనకు పదవి అనివార్యమని ఆయన చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయం గురించి ఇప్పటికే రెండు, మూడుసార్లు చంద్రబాబు దృష్టికి తీసుకు పోయిన మస్తాన్‌రావు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తన ప్రయత్నాలు ముమ్మరం చేసే పనిలో పడ్డారు. అయితే  తాజా రాజకీయ సమీకరణల్లో ఈ సారి జిల్లా నుంచి పార్టీ నేతలెవరికీ అవకాశం ఇవ్వలేనని సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్యులతో  చెప్పినట్లు సమాచారం.
 
 
 
 

>
మరిన్ని వార్తలు