మరో ఇద్దరి బలవన్మరణం

7 May, 2017 22:57 IST|Sakshi

- మొన్న ముగ్గురు, నిన్న ముగ్గురు.. నేడు ఇద్దరు..
- ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు


జిల్లాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న ముగ్గురు ఆత్మహత్య చేసుకోగా, నిన్న మరో ముగ్గురు బలవన్మరణం చెందారు. తాజాగా ఇద్దరు బలవంతపు చావు చచ్చారు. అంతులేని ఆత్మహత్యలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

రొద్దం(పెనుకొండ) : రొద్దం మండలం​శేషాపురం‍లో కురుబ భాగ్యమ్మ(42) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ మునీర్‌ అహమ్మద్‌ తెలిపారు. భాగ్యమ్మ, ఆమె భర్త శ్రీరాములు ఇద్దరూ కలసి గొర్రెలను తోలుకుని గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి శనివారం వెళ్లారన్నారు. మధ్యాహ్నం కడుపునొప్పి తీవ్రం కావడంతో ఇంటికి వెళ్లాల్సిందిగా భర్త సూచించారన్నారు. అయితే ఆమె ఇంటికెళ్లకుండా మార్గమధ్యంలోనే చెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. రాత్రి ఇంటికొచ్చిన భర్తకు భార్య కనిపించకపోవడంతో అటవీ ప్రాంతంలో గాలించారు. అయినా ఆచూకీ కనబడలేదు. ఆదివారం మరోసారి గాలించగా.. చెట్టుకు వేలాడుతూ కనిపించిందని పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ తమ సిబ్బందితో కలసి నేర స్థలానికి వెళ్లారు. ఘటనపై ఆరా తీశారు. రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా మృతురాలికి డిగ్రీ చదివే కూతురు, ఇంటర్‌ చదివే కుమారుడు ఉన్నారు.

ధర్మవరంలో మరొకరు..
ధర్మవరం అర్బన్ : ధర్మవరం కేతిరెడ్డి సూర్యప్రతాప్‌రెడ్డి కాలనీలో నివసిస్తున్న మల్లికార్జున(45) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టన పోలీసులు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని నూనె అంగట్లో గుమాస్తాగా పని చేసే మల్లికార్జున కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేవాడన్నారు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక మార్చురీకి తరలించారు. మృతునికి భార్య తులసమ్మ, కుమారుడు ఓంకార్‌ ఉన్నారు. మల్లికార్జున మృతదేహం వద్ద వారు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. 

మరిన్ని వార్తలు